Begin typing your search above and press return to search.

రేవంత్‌ రెడ్డిపై నాగం సంచలన వ్యాఖ్యలు!

అప్పుడు రేవంత్‌ రెడ్డి ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు. రేవంత్‌ టికెట్లు అమ్ముకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

By:  Tupaki Desk   |   17 Oct 2023 6:40 AM GMT
రేవంత్‌ రెడ్డిపై నాగం సంచలన వ్యాఖ్యలు!
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నవంబర్‌ 30న ఎన్నికలు నిర్వహిస్తారు. డిసెంబర్‌ 3న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.

ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటించగా కాంగ్రెస్‌ తొలి విడతలో 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో టికెట్లు దక్కని నేతలు పార్టీ అధ్యక్షులపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి నాగం జనార్దన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ లో తనకు నమ్మకద్రోహం జరిగిందని నాగం హాట్‌ కామెంట్స్‌ చేశారు. తనకు టికెట్‌ ఎందుకు ఇవ్వలేదో తెలియడం లేదన్నారు. పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి తనయుడికి టికెట్‌ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు.

అవినీతిపై పోరాటం చేస్తే టికెట్‌ ఇవ్వరా? అని నాగం నిలదీశారు. కాంగ్రెస్‌ పార్టీ పురోభివృద్ధికి కృషి చేయడమే తాను చేసిన తప్పా అని ప్రశ్నించారు. దళిత గిరిజన ఆత్మగౌరవ సభ పెట్టి పార్టీ ఇమేజ్‌ పెంచానని నాగం జనార్దన్‌ రెడ్డి గుర్తు చేశారు. ఉమ్మడి జిల్లాలో రాహుల్‌ గాంధీ సభలు, యాత్రలు సక్సెస్‌ చేశానన్నారు. అప్పుడు రేవంత్‌ రెడ్డి ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు. రేవంత్‌ టికెట్లు అమ్ముకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్‌ పార్టీ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డిని తానే గెలిపించానన్నారు. తర్వాత ఆయన బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ లో ఉంటూనే కొడుకు రాజేశ్‌ రెడ్డికి కాంగ్రెస్‌ టికెట్‌ అడుగుతున్నారని.. ఇదెక్కడి న్యాయం? అని నిప్పులు చెరిగారు.

ఆనాడు గుడిపల్లి గట్టు రిజర్వాయర్‌ కోసం పోరాటం చేసింది తానేనని నాగం జనార్దన్‌ రెడ్డి వెల్లడించారు. మార్కండేయ రిజర్వాయర్‌ పై పోరాటం చేస్తేనే పనులు ప్రారంభమయ్యాయన్నారు. తాను కాంగ్రెస్‌ కోసం పోరాడితే టికెట్‌ కూచుకుళ్ళ దామోదర్‌ రెడ్డి తనయుడికి ఇస్తారా? ఇదేమీ న్యాయమని ప్రశ్నించారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి టికెట్టు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? అని నిలదీశారు. అర్హత లేని వాళ్లని పార్టీలో చేర్చుకొని అందలమెక్కిస్తున్నారని మండిపడ్డారు. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కూడా ఒక లీడరేనా? అంటూ ధ్వజమెత్తారు.

ఈ నేపథ్యంలో నాగర్‌ కర్నూల్‌ టికెట్‌ ఆశించి భంగపడిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌ రెడ్డి స్థానిక కేడర్‌ తో సమావేశమయ్యారు. మరోవైపు మాజీ ఎంపీలు బలరాం నాయక్, సురేశ్‌ షెట్కార్, సిరిసిల్ల రాజయ్యలు... మధుయాష్కీ నివాసంలో సమావేశమయ్యారు. పార్టీ విడుదల చేసిన తొలి జాబితాతో పాటు ఇంకా ఖరారు కాని టికెట్ల వ్యవహారంపై వీరు చర్చించినట్టు సమాచారం.

మరోవైపు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రే బుజ్జగింపుల పర్వానికి శ్రీకారం చుట్టారు. ఉప్పల్‌ తో పాటు నగరంలోని పలు నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఆయనతో సమావేశమయ్యారు. టికెట్‌ ఇవ్వకపోవడానికి గల కారణాలను వివరించారు. భవిష్యత్తులో తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.