Begin typing your search above and press return to search.

అల్లుడిని చంపేసి.. సెప్టిక్‌ ట్యాంకులో పూడ్చేశారు!

చిన్న చిన్న విషయాలకు హత్యలే ప్రాథమిక పరిష్కారాలు అవ్వడాలు వంటి సంఘటనలు రెగ్యులర్ గా ఏదో ఒక మూల వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 Aug 2023 11:30 PM GMT
అల్లుడిని చంపేసి.. సెప్టిక్‌ ట్యాంకులో పూడ్చేశారు!
X

ఈమధ్యకాలంలో చంపుకోవడాలు, చిన్న చిన్న విషయాలకు హత్యలే ప్రాథమిక పరిష్కారాలు అవ్వడాలు వంటి సంఘటనలు రెగ్యులర్ గా ఏదో ఒక మూల కనిపిస్తోన్న, వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ఇంటి అల్లుడిని హతమార్చి సెప్టిక్‌ ట్యాంక్‌ లో పూడ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది.

అవును... గుట్టు చప్పుడు కాకుండా అల్లుడిని హతమార్చి సెప్టిక్‌ ట్యాంక్‌ లో పూడ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడాలో ఈ సంఘటన జరిగింది. అల్లుడు తాగొచ్చి అల్లరి చేసిన సందర్భంగా ఈ ఘటన జరగడం గమనార్హం.

వివరాళ్లోకి వెళ్తే... చింత అబ్బసాయిలు - లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో రెండో కుమార్తెకు సుమారు 20ఏళ్ల కిందటే తన సోదరి కుమారుడైన నాగరాజు(45)తో వివాహం జరిపించి ఇల్లరికం తెచ్చుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.

ఈ దాంపత్య జీవితంలో నాగరాజు తరచూ మద్యం తాగడం.. నిత్యం భార్యతో గొడవ పడటంతో.. దీంతో ఆమె పలుమార్లు దేవరుప్పుల పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేయడం జరుగుతు ఉండేవి. ఇదే క్రమంలో ఆగస్టు 7వ తేదీ రాత్రి 10 గంటలకు మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డారు.

ఈ సమయంలో అతనికి నచ్చచెప్పిన భార్య.. అన్నం తినిపించే ప్రయత్నం చేస్తుండగా ఆమె చేతి వేలును గట్టిగా కొరికాడు. దీంతో రక్తస్రావం కావడంతో.. తన తండ్రి అబ్బసాయిలును పిలవగా ఆయన కోపంతో అల్లుడైన నాగరాజును చెంపపై కొట్టారు. అనంతరం మామా అల్లుళ్ల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.

ఇందులో భాగంగా... నాగరాజు ఆవేశంతో మామ మెడపై ఉన్న కండువాతో ఉరి బిగించగా, మామ అబ్బసాయిలు కూడా అల్లుడి మెడలోని కండువాతో అతనికి ఉరి బిగించారు. ఈ ఘర్షణలో అల్లుడు నాగరాజు మృతిచెందాడు. దీంతో అతడిని గుట్టు చప్పుడు కాకుండా సెప్టిక్‌ ట్యాంక్‌ లో తలకిందులుగా వేసి పూడ్చి పెట్టారు.

మరుసటి రోజు ఆగస్టు 8 ఉదయం జనగామలోని తన స్నేహితుడి ఇంటి నుంచి వచ్చిన మృతుడి పెద్ద కుమారుడు కిరణ్‌ ఇంట్లో పడివున్న తండ్రి దుస్తులను చూసి ఆరా తీశాడు. దీంతో అసలు విషయం బయటికి వచ్చింది. ఈ సమయంలో సెప్టిక్‌ ట్యాంకులో తండ్రి శవమై కనిపించాడు.

దీంతో భయపడిన అతడు గ్రామంలోని ఎంపీటీసీ సభ్యుడు జాకీర్‌ కు సమాచారం అందించగా.. ఆయన స్థానిక సర్పంచ్ కి వివరాలు తెలియజేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సెప్టిక్‌ ట్యాంకు నుంచి బయటకుతీశారు. ఈ సమయంలో మృతుడి తలపై బలమైన గాయమైనట్లు గుర్తించారు.

అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష కోసం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి మామ, భార్య పోలీస్‌ స్టేషన్‌ లో లొంగిపోయారు. గ్రామంలో ఎలాంటి ఘనటలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు!