Begin typing your search above and press return to search.

యూకే పార్లమెంటు బరిలో సిద్ధిపేట వాసి... సర్వేలు ఏమి చెబుతున్నాయంటే...?

ఇందులో భాగంగా... ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు.. లేబర్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 May 2024 5:49 AM GMT
యూకే పార్లమెంటు బరిలో  సిద్ధిపేట వాసి... సర్వేలు ఏమి చెబుతున్నాయంటే...?
X

విదేశాల్లో సత్తా చాటుతున్న తెలుగువారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఉద్యోగులుగా, సీఈవోలుగా, పొలిటీషియన్స్ గా పలువురు సత్తా చాటుతున్నారు. ఈ సమయంలో తాజాగా ఆ జాబితాలో మరో తెలుగు వ్యక్తి చేరబోతున్నారు. ప్రస్తుతం బ్రిటన్ లో తెలుగోడి సత్తా చాటే పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తుంది.

అవును... బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలుగు బిడ్డ నిలుస్తున్నాడు. ఇందులో భాగంగా... ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు.. లేబర్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఈ మేరకు నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ నుంచి లేబర్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా పార్టీ అతని పేరు ప్రకటించింది. అయితే ఇది బౌండరీ కమిషన్ సూచనతో కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్ నియోజకవర్గం కావడం గమనార్హం.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ ఏడాదిని ఎన్నికల ఏడాది అని అంటున్నారు. ఈ క్రమంలోనే భారత్ తోపాటు బ్రిటన్ లోనూ ఎన్నికల సందడి మొదలైంది. ఈ సమయంలో తెలుగు బిడ్డ, తెలంగాణ వాసి ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఉదయ్ నాగరాజు కూడా ఆ సందడిలో కీలకం కాబోతున్నారు!

శనిగరం గ్రామానికి చెందిన హనుమంత రావు - నిర్మలాదేవి దంపతుల కుమారుడైన నాగరాజు... చిన్నప్పటి నుంచి కష్టపడేతత్వం కలిగి అంచెలంచాలుగా ఎదిగారు. ఈ క్రమంలోనే బ్రిటన్ లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ లో మేనేజ్మెంట్ సైన్స్ లో పీజీ చేశారు. ఇదే సమయంలో ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్ ట్యాంక్ ని నెలకొల్పారు. అదేవిధంగా... ఇంటర్నేషనల్ స్పీకర్ గా, రచయితగానూ మంచి పేరు సంపాదించారు.

కాగా... బ్రిటన్ లో అన్ని సర్వే సంస్థల ఫలితాల ప్రకారం... ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించి ప్రభుత్వం నెలకొల్పనుందని తెలుస్తుంది. దీంతో... తెలుగు బిడ్డ బ్రిటన్ లో ఎంపీగా పోటీ చేస్తుండడం, గెలుపు కన్ఫాం అని సర్వేలు చెబుతుండటంతో కోహెడ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.