నాగార్జునకు షాక్.. క్రిమినల్ కేసు నమోదు?
అయితే.. సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నప్పటికీ నాగార్జున వదలకుండా ఆమెపై క్రిమినల్ కేసు పెట్టడంతోపాటు పరువు నష్టం దావా వేశారు.
By: Tupaki Desk | 5 Oct 2024 8:27 AM GMTసినీ నటుడు నాగార్జున, కొండా సురేఖల మధ్య నెలకొన్న వివాదం చిలికిచిలికి గాలివానలా తయారవుతోంది. కొండా సురేఖ నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేయడం.. నాగచైతన్య-సమంత విడాకులపై మాట్లాడడాన్ని నాగార్జున ఫ్యామిలీ సీరియస్‌గా తీసుకున్నారు. దాంతో వెంటనే దిగొచ్చిన సురేఖ అపాలజి కోరారు. అటు సురేఖ వ్యాఖ్యల్ని సినీ ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున తప్పుపట్టింది. నాగార్జున ఫ్యామిలీకి సపోర్టుగా నిలిచారు.
అయితే.. సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నప్పటికీ నాగార్జున వదలకుండా ఆమెపై క్రిమినల్ కేసు పెట్టడంతోపాటు పరువు నష్టం దావా వేశారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. సురేఖ అపాలజి చెప్పినప్పటికీ.. ఆమె హద్దులు దాటి మాట్లాడారని, వదిలేది లేదని నాగార్జున సీరియస్‌గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే.. ప్రస్తుతం నాగార్జున క్రిమినల్ కేసు నమోదు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. జనంకోసం అనే సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లుగా సమాచారం.
ఇప్పటికే నాగచైతన్య-సమంత విడాకుల అంశంపై కొండా సురేఖతో వివాదం కొనసాగుతుండగా.. ఇప్పుడు నాగార్జునపై కేసు నమోదు కావడం మరింత చర్చకు దారితీసింది. భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు.. తమ్మికుంట కబ్జా చేసి సినీనటుడు ఎన్ కన్వెన్షన్ నిర్మించారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దాంతో లీగల్ ఒపీనియన్‌ను సైతం పోలీసులు కోరారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.
నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ 3 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే దానిని కూల్చివేస్తారని ప్రచారం జరిగినా.. టచ్ చేయలుకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత మరోసారి ఎన్ కన్వెన్షన్‌పై ఫిర్యాదులు వచ్చాయి. దాంతో హైడ్రా దానిని వెంటనే కూల్చివేసింది. తాజాగా.. సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దాంతో నాగార్జున అభిమానులు సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. నాగార్జునపై కేసు నమోదు కావడంపై స్పందిస్తున్నారు. సురేఖ విషయంలో నాగార్జున వెనక్కి తగ్గకపోవడం వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అంటున్నారు. అందుకే.. కోర్టు స్టే ఉన్నప్పటికీ ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేశారని చెబుతున్నారు.