హాట్ టాపిక్... ‘ఎన్’ కన్వెషన్ కూల్చివేత వెనుక ఓ కీలక మంత్రి?
సినీనటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్ లోని "ఎన్" కన్వెషన్ సెంటర్ కూల్చివేత వ్యవహారం ఉదయం నుంచీ తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 Aug 2024 9:18 AM GMTసినీనటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్ లోని "ఎన్" కన్వెషన్ సెంటర్ కూల్చివేత వ్యవహారం ఉదయం నుంచీ తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించడం, చెరువులను రక్షించడం ప్రధాన లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా ఈ కూల్చివేత పనులు చేపట్టింది.
దీంతో ఈ వ్యవహారంపై నాగార్జున స్పందించారు. ఈ కూల్చివేతలపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఇదే క్రమంలో... ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు జరిగిన కూల్చివేత చట్ట విరుద్ధంగా.. లేదా, తప్పుడు సమాచారంతో జరిగిందని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పూర్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు!
ఇందులో భాగంగా... ఆ భూమి పట్టా భూమని.. అది పూర్తిగా ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమని.. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసులపై స్టే కూడా మంజూరూ చేసిందని.. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం ఏమాత్రం సరికాదని నాగార్జున స్పష్టం చేశారు. ఈ సమయంలో ఈ కూల్చివేతల వెనుక ఓ మంత్రి ఉన్నారంటూ కథనాలు తెరపైకి వస్తున్నాయి!
అవును... మాదాపూర్ లోని ఎన్ కన్వెషన్ కూల్చివేత వెనుక ప్రధానంగా రేవంత్ రెడ్డి కేబినెట్ లోని ఓ కీలక మంత్రి ఉన్నారని అంటున్నారు. మాదాపూర్ లోని తుమ్మిడి చెరువును ఆనుకొని నాగార్జున ఈ నిర్మాణం చేపట్టారని ఇటీవలే ఆయన సీఎం రేవంత్ కు లేఖ కూడా రాసినట్లు చెబుతున్నారు. ఎఫ్.టీ.ఎల్. పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా దీన్ని నిర్మించారని లేఖలో పేర్కొన్నారని అంటున్నారు.
ఇదే క్రమంలో... రేవంత్ కు లేఖ రాయడంతోపాటు.. హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోన్న హైడ్రాకు సదరు మంత్రి కీలక సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. ఇందులో భాగంగా శాటిలైట్ ఫోటోలతో సహా పలు ఆధారాలు ఇచ్చారని అంటున్నారు. దీంతో... ఈ ఆధారాలపై విచారణ జరిపిన అనంతరం హైడ్రా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
దీంతో... ఎవరా కీలక మంత్రి.. ఏమా లేఖ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మరోవైపు తుమ్మిడి కుంట చెరువుకు ఇంకోవైపున ఉన్న తాత్కాలిక నిర్మాణాలను కూడా హైడ్రా అధికారులు భారీ బందోబస్తు నడుమ కూల్చి వేస్తున్నారు. ఇదే సమయంలో... చెరువు స్థలంలో అక్రమంగా బోర్లు వేసిన వారిపై కూడా అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. ఈ బోర్ల ద్వారా ట్యాంకర్లతో సిటీలో నీటిని అమ్ముకుంటూ దందా చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ అక్రమ బోర్లను తొలగించేందుకూ హైడ్రా అధికారులు సిద్ధమయ్యారని తెలుస్తోంది.