భారీ షాక్: సీఎం రేవంత్ సొంత జిల్లాలో ఇలా జరిగిందేంటి?
సీఎం రేవంత్‌కు సొంత జిల్లా నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తిలో భారీ షాక్ తగిలింది.
By: Tupaki Desk | 2 Oct 2024 6:30 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుగా ఉంటున్నారు. పాలనపరంగా డౌన్ టు ఎర్త్ అనేలా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి సుమారు 11 మాసాలు కావస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి మరకలు అంటలేదు. ఆయన మంత్రి వర్గంపైనా ఎలాంటి విమర్శలు లేవు. పైగా ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేసేందుకు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. మహిళలకు ఫ్రీబస్సు ప్రయాణం కల్పించారు. రైతులకు రుణాల మాఫీ చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు.
ఇంకోవైపు.. హైదరాబాద్ ను సుందరీకరించే పనిని చేపట్టారు. నగరాన్ని నందనవనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా తనదైన శైలిలో దూకుడుగా ఉన్న సీఎం రేవంత్‌కు సొంత జిల్లా నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తిలో భారీ షాక్ తగిలింది. ఇక్కడ జరిగిన కార్మిక సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చిత్తుగా ఓడిపోయాడు. ఈ అభ్యర్థి తరఫున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రంగంలో కి దిగినా ఎలాంటి ప్రభావం చూపించలేక పోయారు. అంతేకాదు.. రేవంత్ పాలనను కూడా ఎన్నికల సమయంలో ప్రచారం చేశా రు. అయినా.. కార్మికులు మాత్రం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ అనుబంధ విభాగానికి కార్మికులు మద్దతు పలికారు.
ఏం జరిగింది?
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని స్పిన్నింగ్ మిల్లులో కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 450 మంది కార్మికులు పాల్గొన్నారు. వీరిలో 439 ఓట్లు వేశారు. అయితే.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కేవీ (బీఆర్ఎస్ అనుబంధ కార్మిక విభాగం) బలపర్చిన అభ్యర్థి సూర్యప్రకాశ్ రావుకు 251 ఓట్లు వచ్చాయి. ఇక, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన ఐఎన్‌టీయూసీ(కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగం) అభ్యర్థి ఆనంద్‌కుమార్ కు 183 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన ఓడిపోయారు. ఈ పరిణామాలపై కాంగ్రెస్ నేతలు విస్మయం వ్యక్తం చేస్తుండగా.. బీఆర్ ఎస్ నాయకులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు.