సిగరెట్ తాగుతున్న యువతిని వీడియో తీశాడు..కట్ చేస్తే..!
ఎవరైనా తమ పరిధిని దాటితో చట్టబద్ధంగా చర్యలు తీసుకునేలా వ్యవహరించాలే కానీ.. అనవసరమైన దూకుడుకు వెళితే తిప్పలు తప్పవు. అందుకు నిదర్శనమే తాజా ఉదంతం
By: Tupaki Desk | 9 April 2024 1:30 PM GMTమారుతున్న కాలానికి తగ్గట్లుగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎవరి పని వారు చూసుకోవాల్సిన వేళ.. అందుకు భిన్నంగా వ్యవహరించిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అలా అని అతడ్ని చంపేయటం కరెక్టు అని చెప్పట్లేదు. అలా అని.. దాడి చేయటాన్ని ప్రోత్సహించటం లేదు. ఎవరైనా తమ పరిధిని దాటితో చట్టబద్ధంగా చర్యలు తీసుకునేలా వ్యవహరించాలే కానీ.. అనవసరమైన దూకుడుకు వెళితే తిప్పలు తప్పవు. అందుకు నిదర్శనమే తాజా ఉదంతం.
మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో చోటు చేసుకున్న ఉదంతం షాకింగ్ గా మారింది. శనివారం అర్థరాత్రి వేళ రంజిత్ రాథోడ్ అనే 28 ఏళ్ల యువకుడు సిగరెట్ కోసం మహాలక్ష్మి నగర్ లోని షాప్ కు వెళ్లాడు. అక్కడ 30 ఏళ్ల జయశ్రీ తన స్నేహితురాలు సవితతో కలిసి సిగరెట్ తాగుతోంది. వీరిని రంజిత్ అదే పనిగా చూస్తూ.. వారు సిగరెట్ తాగుతున్న క్రమాన్ని వీడియో తీశాడు.
దీంతో.. అతడ్ని ఆ ఇద్దరు మహిళలు ప్రశ్నించారు. అది కాస్తా వాదనగా మారింది. దీంతో వీడియో తీసిన రంజిత్ ను కోపంతో తిట్టిన జయశ్రీ.. అతడి ముఖం మీద పొగ ఉదింది. ఇదంతా అతడు తీసిన వీడియోలో రికార్డు అయ్యింది. అనంతరం అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ.. అతగాడి మీద కోపం తీరని జయశ్రీ తన స్నేహితులు ఆకాశ్.. జీతూలకు ఫోన్ చేసి తమకు ఎదురైన పరిస్థితి గురించి చెప్పారు.
దీంతో వారు అన్ని వీధులు గాలించి రంజిత్ ను వెతికి పట్టుకున్నారు. వారంతా కలిసి అతడిపై దాడికి దిగారు. ఈ క్రమంలో రంజిత్ ను ఆకాశ్ కత్తితో పొడవగా.. తర్వాత ఆ కత్తిని తీసుకున్న జయశ్రీ పలుమార్లు రంజిత్ కడుపులో పొడిచేసింది. దీంతో తీవ్ర గాయాలైన రంజిత్ ను పోలీసులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు జయశ్రీ.. సవిత.. ఆకావ్.. యశ్వంత్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఎక్కడ మొదలైన వ్యవహారం మరెక్కడి వరకు వెళ్లిందోచూస్తే అవాక్కు అవ్వాల్సిందే.