Begin typing your search above and press return to search.

కంప్యూటర్ ఆపరేటర్ టూ హర్యానా సీఎం... నాయబ్ సింగ్ ఫ్లాష్ బ్యాక్ తెలుసా?

ఈ కార్యక్రమానికి ముందు సింగ్.. వాల్మీకి ఆలయంలో పూజలు చేశారు.

By:  Tupaki Desk   |   17 Oct 2024 5:30 PM GMT
కంప్యూటర్  ఆపరేటర్  టూ హర్యానా సీఎం... నాయబ్  సింగ్  ఫ్లాష్  బ్యాక్  తెలుసా?
X

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎనికల్లో ఘన విజయం సాధించడంతో హర్యానాలో బీజేపీ ప్రభుత్వం మరోసారి కొలువుదీరింది. ఇందులో భాగంగా... రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముందు సింగ్.. వాల్మీకి ఆలయంలో పూజలు చేశారు.

అవును... హర్యానా కొత్త సీఎంగా నాయబ్ సింగ్ సైనీ రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. గురువారం పంచకులలోని మైదానంలో.. జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజనాథ్ సింగ్ తో పాటు బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు పాల్గొన్నారు!

ఈ సందర్భంగా సైనీ మంత్రివర్గంలో 13 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా స్పందించిన సైనీ... డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం వేగంగా ముందుకు వెళ్తుందని చెప్పారు. ఇక ఈ సమయంలో... హర్యానా నూతన సీఎం నాయబ్ సైనీ ఫ్లాష్ బ్యాక్ చర్చనీయాంశంగా మారింది.

నాయబ్ సింగ్ సైనీ (54)... 1970 జనవరి 5న హర్యానాలోని అంబాలా జిల్లాలోగ మీర్జాపూర్ మజ్రా అనే చిన్న గ్రామంలో జన్మించారు. తండ్రి తేలు రాంసింగ్ హర్యానాకు చెందిన వ్యక్తికాగా.. తల్లి పంజాబ్ కు చెందిన కుల్వంత్ కౌర్. ఇక.. పాఠశాల విద్యను హర్యానాలోనూ, గ్రాడ్యుయేషన్ ను బీహార్ లోనూ, న్యాయ విద్యను యూపీలోనూ చదివారు సైనీ.

ఇందులో భాగంగా... బీహార్ లోని ఫుజఫర్ లో గల బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందిన ఆయన... ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఉన్న చైదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బీ. పట్టా పొందారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. ఈ క్రమంలో... ముందుగా ఆర్.ఎస్.ఎస్.లో చేరి తర్వాత బీజేపీ కండువా కప్పుకున్నారు.

ఈ క్రమంలో నాయబ్ సింగ్ సైనీ... అంబాలాలోని భారతీయ జనతాపార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేశారు. తర్వాత బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఈ క్రమంలో 2014లో అంబాలా జిల్లాలోని నారాయణ గడ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో ఎంపీగా గెలుపొందారు.

ఈ నేపథ్యంలోనే 2023 అక్టోబర్ నెలలో హర్యానా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన నాయబ్ సింగ్.. ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి బధ్యతలు చేపట్టారు. ఇది అత్యంత సక్సెస్ ఫుల్ జర్నీల్లో ఒకటని అని అంటూ కొనియాడుతూ, కంగ్రాట్స్ చెబుతున్నారు నెటిజన్లు.

నాయబ్ సింగ్ సైనీకి 2000 సంవత్సరంలో అంబాలాలోని సుమన్ సైనీతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు అనికేత్, కుమార్తె వంశిక ఉన్నారు. నాయబ్ సింగ్ భార్య సుమన్ సైనీ కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఇందులో భాగంగా... 2022లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన ఆమె.. ఇప్పుడు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్నారు.

కాగా... ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. 90 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీ బలం 48గా ఉంది. ఈ సమయంలో పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చిన నాయబ్ సింగ్ సైనీ వైపే సీఎం ఎంపిక విషయంలో అంతా మొగ్గు చూపారు.

ఈ సమయంలో... మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సీనియర్ నేత అనిల్ విజ్ ఆయన పేరును ప్రతిపాదించగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.