టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు!
ఆయనతో పాటు మరో ఇరవై నాలుగు మంది బోర్డు మెంబర్స్ ని కూడా నియమించారు.
By: Tupaki Desk | 30 Oct 2024 5:46 PM GMTదేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఆలయంగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి ఒక టీవీ సంస్థ అధిపతి అయిన బీఆర్ నాయుడుని ఎంపిక చేస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనతో పాటు మరో ఇరవై నాలుగు మంది బోర్డు మెంబర్స్ ని కూడా నియమించారు.
బీఆర్ నాయుడు పేరు చాలా కాలంగా నలుగుతూ వస్తోంది. అయితే ఇటీవల కాలంలో తిరుమలలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలసింది అన్నది దుమారంగా మారింది. దాంతో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా అందరి చూపూ టీటీడీ మీదనే పడింది.
ఈ నేపథ్యంలో బోర్డుకు రాజకీయాలతో సంబంధం లేని వారిని ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి లేదా తమ రంగాలలో విశేష ప్రతిభ కనబరచిన వారికి అప్పగిస్తారు అని అనుకున్నారు. కానీ కాస్తా ఆలస్యంగా అయినా బీఆర్ నాయుడు పేరుని ప్రభుత్వం ఖారు చేయడం ద్వారా గత ప్రచారం నిజమే అనేలా చేసింది.
ఏది ఏమైనా చూస్తే కనుక ఒక మీడియా సంస్థ అధిపతికి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పదవిని ఇవ్వడం అన్నది ఒక సంచలన నిర్ణయం గానే చూడాలి. ఇక టీటీడీ బోర్డు మెంబర్లుగా చూస్తే కనుక సాంబశివరావు (జాస్తి శివ), సదాశివరావు నన్నపనేని, ఎం.ఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే), జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే), ప్రశాంతిరెడ్డి (కొవ్వూరు ఎమ్మెల్యే), పనబాక లక్ష్మి (మాజీ కేంద్ర మంత్రి), మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కష్ణమూర్తి, బురగపు ఆనందసాయి, సుచిత్ర ఎల్లా, నరేశ్‌కుమార్, డాక్టర్ అదిత్ దేశాయ్, శ్రీసౌరబ్ హెచ్ బోరా,కృష్ణమూర్తి, కోటేశ్వరరావు,దర్శన్. ఆర్.ఎన్, జస్టిస్ హెచ్‌ఎల్ దత్, శాంతారామ్, పి.రామ్మూర్తి, జానకీ దేవి తమ్మిశెట్టి, బూంగునూరు మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ ఉన్నారు
ఇక ఈ బోర్డులో ఏపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు దక్కింది. అలాగే తెలంగాణా నుంచి అయిదుగురికి అవకాశం ఇచ్చారు. అదే విధంగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి కూడా ప్రాతినిధ్యం దక్కింది.