ఖైదీ కడుపులో మేకులు.. షేవింగ్ బ్లేడ్.. గంజాయి పొట్లాలు!
దీంతో.. జనరల్ సర్జన్ యూనిట్ వైద్యులు అతడికి ఎక్స రే తీయగా.. రెండు మేకులు.. షేవింగ్ బ్లేడ్ తోపాటు ఇతర వస్తువులు ఉన్నట్లుగా గుర్తించారు.
By: Tupaki Desk | 10 Jan 2024 7:30 AM GMTతీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడుతున్న ఒక ఖైదీని పరీక్షించిన వైద్యులు నిర్ఘాంతపోయిన ఉదంతమిది. ఎందుకంటే.. అతడి కడుపులో మేకులు.. రెండు చిన్న గంజాయి పొట్లాలు(?)..షేవింగ్ బ్లేడ్.. రబ్బరు మూతతో పాటు.. టేపు చుట్టలు ఉండటంతో షాక్ తిన్నారు.ఇంతకూ ఈ ఉదంతం ఎక్కడ జరిగిందంటే.. హైదరాబాద్ లోని చంచలగూడకు చెందిన ఒక ఖైదీ (21 ఏళ్ల ఎండీ సొహైల్) తీవ్రమైన కడుపు నొప్పితో విలవిలాడుతున్నట్లుగా గుర్తించారు.
దీంతో అతడ్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీంతో.. జనరల్ సర్జన్ యూనిట్ వైద్యులు అతడికి ఎక్స రే తీయగా.. రెండు మేకులు.. షేవింగ్ బ్లేడ్ తోపాటు ఇతర వస్తువులు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో అతడికి సర్జరీ చేశారు. రెండు మేకులు.. షేవింగ్ బ్లేడ్.. ఒక టేపు.. ఇతర వస్తువుల్ని బయటకు తీశారు. సర్జరీని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయటంలో ఉస్మానియా ఆసుపత్రికి చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు బి.రమేశ్ కుమార్ కీలకభూమిక పోషించారు.
ఎండోస్కోపీతో విజయవంతంగా సర్జరీని నిర్వహించినట్లుగా ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ వెల్లడించారు. అయితే.. ఈ వస్తువుల్నిఎప్పుడు.. ఎందుకు మింగాడు? అన్న విషయాన్ని ఖైదీ వెల్లడించలేదు. అదే సమయంలో గంజాయి పొట్లాలుగా భావిస్తున్న వాటిని పరీక్షల కోసం పంపారు. సరైన సమయంలో సర్జరీ చేయటం ద్వారా ఖైదీ ప్రాణాన్ని డాక్టర్లు కాపాడినట్లుగా పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి సదరు ఖైదీ ఆరోగ్యం నిలకడగా ఉందని.. మరికొద్ది రోజులు వైద్యుల పర్యవేక్షణ అనంతరం డిశార్జి చేస్తారని వైద్యులు చెబుతున్నారు. జైల్లో ఖైదీకి షేవింగ్ బ్లేడ్.. ఇతర వస్తువులు ఎలా చిక్కాయన్నది జైలు వర్గాల్లో చర్చగా మారింది. ఈ వ్యవహారంపై జైలు సిబ్బంది అంతర్గత విచారణను జరుపుతున్నట్లుగా చెబుతున్నారు.