Begin typing your search above and press return to search.

డబ్బులు డబుల్... అడ్డంగా మోసపోయిన డాక్టర్!

వివరాళ్లోకి వెళ్తే... నల్గొండ జిల్లా చందనపల్లి గ్రామానికి చెందిన ఆర్.ఎం.పీ. వైద్యుడు రామోజు రామాచారి రెండేళ్ల క్రితం కొత్త ఇంటిని కట్టించారు.

By:  Tupaki Desk   |   29 Jun 2024 4:41 AM GMT
డబ్బులు డబుల్... అడ్డంగా మోసపోయిన డాక్టర్!
X

ప్రజలకు ఎంత అవగాహన కల్పిస్తున్నా అజ్ఞానంలోనో, అత్యాశతోనో ఉన్నది కాస్తా పోగొట్టుకుంటున్నారు. ఫలితంగా ఫలితం కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లుగా మారిపోతుంది! నిరక్షరాస్యులు మోస పోయారంటే కాస్త అర్ధం చేసుకోవచ్చు.. చదువుకున్న వారు, సమాజంపై కాస్త అవగాహన ఉన్నట్లు కనిపించేవారు సైతం ఇలా మోసాల బారిన పడుతుండటం షాకింగ్ గా అనిపిస్తుంటుంది!

తాజాగా ఇలాంటి ఒక ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో మోసగాళ్లు ఎంచుకున్న మంత్రం... "మీ డబ్బుని డబుల్ చేస్తాం" అని! అది కూడా షేర్ మార్కెట్ లోనో, బిజినెస్ లోనో పెడితే కాదు సుమా... రంగునీటిలో ముంచి డబుల్ చేస్తారంట! దీన్ని ఒక డాక్టర్ నమ్మారు! శాంపుల్ టెస్ట్ చేయించారు! అందులో గెలిచిన డాక్టర్... అసలు పరీక్షలో మొత్తం మునిగిపోయారు. లబో దిబో మంటున్నారు!

వివరాళ్లోకి వెళ్తే... నల్గొండ జిల్లా చందనపల్లి గ్రామానికి చెందిన ఆర్.ఎం.పీ. వైద్యుడు రామోజు రామాచారి రెండేళ్ల క్రితం కొత్త ఇంటిని కట్టించారు. ఆ సమయంలో ఇంటి నిర్మాణంలో బీహార్ కు చెందిన రాం నరేష్ యాదవ్ అనే తాపీమేస్త్రితో పరిచయం ఏర్పడింది. ఈ సమయంలోనే తనకు తెలిసిన వాళ్ల దగ్గర డబ్బులు రెట్టింపు చేసే లిక్విడ్ ఉందని నమ్మించాడు.

ఈ సమయలో... బీహార్ కు చెందిన అతని ఫ్రెండ్స్ అఫ్తాబ్, షేక్ సిరాజ్ లను రామాచారికి పరిచయం చేశాడు. ఈ కార్యక్రమం ఈ నెల 22న జరిగింది. ఈ సమయంలో ఒక శాంపుల్ టెస్ట్ ని అడిగాడు రామాచారి. ఇందులో భగంగా వారికి తొలుత 6వేల రూపాయలు ఇస్తే... వారు ఒక లిక్విడ్ లో ముంచి దాన్ని 13వేలు చేసి చూపించారు. దీంతో... రామాచారికి నమ్మకం వచ్చేసింది.

అంతే... అనుకున్నదే తడవుగా తనవద్ద ఉన్న 33 లక్షల రూపాయల నగదును తీసుకొచ్చి వాళ్ల చేతుల్లో పోసేశాడు! దీంతో వారు ముగ్గురూ తమ వెంటతెచ్చుకున్న లిక్విడ్ ను ఒక బకెట్లో పోసి అందులో నగదును ముంచి బయటకు తీశారు. వాటికి తెలుగు, బ్రౌన్ కలర్ ఫ్లాస్టర్లు కట్టారు. వీటిని ఒక అరగంట సేపు ఆరబెడితే డబ్బు డబుల్ అయిపోద్దని చెప్పారు. అనంతరం వీరు ముగ్గురూ జారుకున్నారు.

తీరా అవి కాస్తా ఆరిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే... పై భాగంలో 500 రూపాయల నోట్లు, కింద తెల్ల కాగితాలు కనిపించాయి. అప్పటికి తత్వం బోధపడిందో ఏమో కానీ... లబో దిబో మంటూ పోలీసులను ఆశ్రయించారు! దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... నల్గొండ రైల్వే స్టేషన్ లో సిరాజ్, రాం నరేష్ లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో వారి నుంచి రూ.24 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.