బీజేపీ నుంచి పోటీకి అసలు కారణం ఇదే... నల్లమిల్లి వ్యాఖ్యలు!
చాలా సస్పెన్స్ లు, ట్విస్టులు, జలక్కుల అనంతరం ఎట్టకేలకు అనపర్తి కూటమి అభ్యర్థిత్వంపై క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 April 2024 10:51 AM GMTచాలా సస్పెన్స్ లు, ట్విస్టులు, జలక్కుల అనంతరం ఎట్టకేలకు అనపర్తి కూటమి అభ్యర్థిత్వంపై క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. కూటమిలో భాగంగా చంద్రబాబు ఈ స్థానాన్ని తొలుత బీజేపీకి కేటాయించారు. దీంతో... నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వర్గం నిప్పులు చెరిగింది. దీంతో... ఆయనే బీజేపీలో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు! ఈ వ్యవహారం అంతా తెలిసిందే! ఈ సమయంలో తాను బీజేపీ నుంచి పోటీ చేయడంపై తాజాగా నల్లమిల్లి స్పందించారు.
అవును... అనపర్తి కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి ఈరోజు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తన ఇంటి నుంచి ఆర్వో ఆఫీసుకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన... గత కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అన్నీ అందరికీ తెలుసు అని మొదలుపెట్టారు. అనంతరం... టీడీపీ - జనసేన కూటమి ఏర్పడిన తర్వాత తొలి జాబితాలోనే తన పేరు టీడీపీ నుంచి వెల్లడైనట్లు పేర్కొన్నారు.
అయితే... టీడీపీ – జనసేన కూటమిలోకి బీజేపీ వచ్చి చేరడం, ఆ సీటు బీజేపీ తీసుకోవడం.. తదనంతరం జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో... అనపర్తిలో అభ్యర్థిత్వం బలంగా ఉండాలని, తద్వారా ఎన్డీయే కూటమి లక్ష్యం ఏదైతే ఉందో అది సాధించడానికి ప్రతీ నియోజకవర్గంలోనూ బలమైన అభ్యర్థే ఉండాలనే ఆలోచనతోనే.. తనకు టిక్కెట్ ఇచ్చినట్లు నల్లమిల్లి తెలిపారు! ఈ సందర్భంగా తాను పోటీలో ఉండకూడదంటూ వైసీపీ చేసిన కుట్రలను చేధించినట్లు నల్లమిల్లి చెప్పడం గమనార్హం!
కాగా... 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై 1,373 ఓట్ల మెజారిటీతో గెలిచిన నల్లమిల్లి... 2019 ఎన్నికల్లో 55,207 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో అనపర్తిలో టీడీపీ అభ్యర్థి నల్లమిల్లికి 56,564 ఓట్లు, జనసేన అభ్యర్థికి 11,769 ఓట్లు రాగా... వైసీపీ అభ్యర్థి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డికి 1,11,771 ఓట్లు వచ్చాయి! ఈ నేపథ్యంలో... మరోసారి బరిలోకి దిగుతున్న నల్లమిల్లి... ఈసారి టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు!