చిన్నమ్మ ప్లేస్ లో ఆయన...కూటమిలో కొత్త లెక్కలు
ఏపీ బీజేపీకి కొత్త బాస్ వస్తున్నారు. ఆయన రాకకు కౌంట్ డౌన్ మొదలైంది. ఆయనే ఉమ్మడి ఏపీ చిట్టచివరి సీఎం అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
By: Tupaki Desk | 27 Sep 2024 3:50 PM GMTఏపీ బీజేపీకి కొత్త బాస్ వస్తున్నారు. ఆయన రాకకు కౌంట్ డౌన్ మొదలైంది. ఆయనే ఉమ్మడి ఏపీ చిట్టచివరి సీఎం అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన అనుభవాన్ని ఆయన సామాజిక వర్గాన్ని వాడుకోవాలని తద్వారా ఏపీలో రాజకీయ పంట పండించుకోవాలని కేంద్ర బీజేపీ పెద్దలు చూస్తున్నారు అని అంటున్నారు.
ఇక అక్టోబర్ నెలలో దసరా ముందు కానీ తరువాత కానీ నల్లారి వారిని ఏపీ బీజేపీ చీఫ్ గా డిక్లేర్ చేస్తూ ఒక కీలక ప్రకటన వెలువడుతుందని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. ఇంకో వైపు చూస్తే దగ్గుబాటి పురంధేశ్వరి పదవీ కాలం ఇంకా తొమ్మిది నెలలు దాకా ఉంది.
ఆమె గత ఏడాది జూలైలో పార్టీ బాధ్యతలు స్వీకరించారు. ఆమ వచ్చాక బీజేపీ బాగుపడిందా అంటే ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె నాయకత్వంలో పార్టీ మూడు ఎంపీలు ఎనిమిది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. పొత్తులలో భాగంగానే ఇది జరిగింది.
పురంధేశ్వరి ప్లేస్ లో వేరే వారు ఉంటే టీడీపీతో పొత్తు కానీ సీట్ల సర్దుబాటులో అంత సానుకూలత కానీ సాధ్యపడేది కాదు అని అంటారు. అంతదాకా ఎందుకు ఇటీవల జరిగిన ఎన్డీయే మీట్ లో చంద్రబాబు కూడా అదే మాట అన్నారు. పురంధేశ్వరి ఉండబట్టే ఎన్డీయే కూటమి మరింత పటిష్టంగా అయిందిని పొత్తుల చిక్కులు కూడా లేకుండా అంతా సాఫీగా సాగిందని కూడా చెప్పారు.
ఇది ఆమెకు ప్రశంస అయినా ఇదే ఏపీలోని ఆమె అంటే పడని బీజేపీ సీనియర్లకు ఆయుధంగా మారిందని అంటున్నారు. ఆమె టీడీపీ ఎదిగేలా చూస్తున్నారని బీజేపీలో సీనియర్లను పట్టించుకోవడం లేదని వారు అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఏపీలో ఇపుడు రాజకీయంగా ఎదిగేందుకు చాన్స్ ఉన్నా ఆమె చేయాల్సిన తీరున పనిచేయడం లేదు అని కూడా ఆరోపించారు అని అంటున్నారు.
ఏపీలో ఒక బలమైన పార్టీ వైసీపీ నెమ్మదిగా తగ్గిపోతోందని ఆ స్పేస్ లోకి వెళ్లాల్సిన స్థితిలో ఆమె క్రియాశీలంగా వ్యవహరించడం లేదు అని అంటున్నారు. ఇక కేంద్ర బీజేపీ పెద్దలకు సీనియర్లు చేసిన మరిన్ని ఫిర్యాదులు ఏమిటి అంటే ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా అర్హులైన వారికి టికెట్లు దక్కలేదని దానికి ఆమె వ్యవహరించిన తీరే కారణం అని చెబుతున్నారు. అలాగే నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఒకే ఒక్కటి కూటమి నుంచి దక్కిందని అది కూడా మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి లభించలేదని ఎత్తి చూపుతున్నారు.
దాంతో ఆమెను మార్చాలని వారంతా పట్టుబడుతున్నారు. ఇక కేంద్ర బీజేపీ పెద్దలు కూడా ఇపుడు వైసీపీని టార్గెట్ చేశారు. ఏపీలో వైసీపీ నుంచి వలసలు దండీగా ఉండాలని అవి బీజేపీ వైపుగా సాగాలి అంటే జగన్ సామాజిక వర్గానికి చెందిన వారికే పగ్గాలు అప్పగించడం బెటర్ అని కూడా యోచిస్తున్నారుట.
అందుకే ఏరి కోరి మరీ రాయలసీమకు చెందిన నల్లారి వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నరు అని అంటున్నారు. ఆయన నియామకం ద్వారా ఏపీలో ప్రస్తుతం రాజకీయంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించడానికి బీజేపీ చూస్తోంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఏపీ కూటమి ప్రభుత్వంలో బీజేపీ జూనియర్ పార్టనర్ గా ఉంది అని అంటున్నారు. జనసేనకు దక్కుతున్న ప్రాధాన్యత బీజేపీకి దక్కడం లేదు. దానికి ప్రస్తుత నాయకత్వం పెద్దగా ఆ దిశగా ఆలోచించడం లేదన్నది సీనియర్ల ఆరోపణ. దాంతో కొత్త వారిని తెస్తే కూటమిలో లెక్కలు కూడా సెట్ అయి వాటాలు సమానంగా బీజేపీకి వస్తాయని ఆలోచిస్తున్నారుట.
ఇక నల్లారి వారితో బాబుకు మంచి రిలేషన్స్ ఉన్నాయని అంటున్నారు. అయితే అవి ఎంత ఉన్నా కూడా పురంధేశ్వరి మాదిరిగా పూర్తిగా ఏపీ బీజేపీ తగ్గే అవకాశాలు ఉండవని బీజేపీ సీనియర్లు భావిస్తున్నారుట. మరిన్ని విడతలుగా నామినేటెడ్ పదవులను కూటమి ప్రభుత్వ పెద్దలు త్వరలో ప్రకటించనున్నారు. అందులో బీజేపీకి రావాల్సిన వాటాను దక్కించుకోవాలంటే చిన్నమ్మను తప్పించి కొత్త వారిని తేవాల్సిందే అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే బీజేపీలో అయితే మధ్యలో పదవీకాలంలో అధ్యక్షులను మార్చిన సందర్భం బహు అరుదు. కానీ చిన్నమ్మ విషయంలోనే ఇది జరుగుతుండడంతో చర్చనీయాంశం అవుతోంది. ఒక వైపు ఆమె ఎంపీగా గెలిచినా కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు. ఇంకో వైపు ఉన్న పదవిని తప్పించేస్తే కమలం పార్టీలో ఆమె రాజకీయం ఏ విధంగా సాగుతుందో చూడాల్సి ఉంది. అదే విధంగా చూస్తే నల్లారి వారి రాకతో కూటమిలో సమీకరణలు మారుతాయా అన్నది కూడా చర్చగా ఉంది.