Begin typing your search above and press return to search.

రాజ్యసభ రూట్ తో కేంద్ర మంత్రి సీటుకు కిరణ్ ?

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సరికొత్త ప్లాన్ తోనే ముఖ్యమంత్రి చంద్రబాబుని ఇటీవల కలిశారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   9 Oct 2024 3:54 AM GMT
రాజ్యసభ రూట్ తో కేంద్ర మంత్రి సీటుకు కిరణ్  ?
X

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సరికొత్త ప్లాన్ తోనే ముఖ్యమంత్రి చంద్రబాబుని ఇటీవల కలిశారు అని అంటున్నారు. హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి కిరణ్ వెళ్ళి మాటా మంతీ చేయడం వెనక బిగ్ ప్లాన్ ఉందని అంటున్నారు. బీసీ ఉద్యమ నేత ఆర్ క్రిష్ణయ్య నాలుగేళ్ళ నిండా పదవీకాలం ఉంచుకుని మరీ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో పాటు ఆయన బీజేపీలో చేరుతారు అన్న చర్చ కూడా సాగుతోంది.

దాంతో ఆ సీటు తిరిగి బీజేపీకే ఇవ్వాలని కేంద్ర బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. కేంద్ర పెద్దల మదిలో ఎవరి పేరు ఉందో తెలియదు కానీ ఉమ్మడి ఏపీ చివరి సీఎం బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ ఎంపీ సీటు మీద కర్చీఫ్ వేశారు అని అంటున్నారు.

ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్ళి కేంద్ర బీజేపీ పెద్ద హోం మంత్రి అమిత్ షాను కలసి వచ్చారు. ఆ సమయంలో ఆయన చెవిన కూడా తన విన్నపాన్ని చెప్పుకుని ఉంటారని అంటున్నారు. అయితే ఏపీలో ఎంపీ సీటు దక్కాలీ అంటే కీలకమైన పాత్ర చంద్రబాబుదే. ఆయన ఓకే అంటేనే ఎవరికి అయినా ఎంపీ పదవి లభిస్తుంది.

దాంతో కేంద్ర బీజేపీ పెద్దల సూచనల మేరకు కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబుని కలసి వచ్చారా అన్న చర్చ కూడా సాగుతోంది. బీజేపీ కోటాలో రాజ్యసభ సీటు దక్కించుకుంటే ఆ మీదట కేంద్ర మంత్రిగా కూడా కుదురుకోవచ్చు అన్నది మాజీ సీఎం మాస్టర్ ప్లాన్ అంటున్నారు. నిజానికి రాజంపేట నుంచి కిరణ్ ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో గెలిచి ఉంటే కనుక కచ్చితంగా ఆయన కేంద్ర మంత్రి అయి ఉండేవారు.

కానీ బ్యాడ్ లక్ ఆయనను ఓటమి వరించింది. దాంతో ఇపుడు అంది వచ్చిన అవకాశాన్ని ఆయన సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇక ఏపీలో మూడు రాజ్యసభ ఖాళీలు ఉన్నాయి. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు చాలా కాలం క్రితమే తమ ఎంపీ పదవులకు రాజీనామాలు చేశారు.

ఇక లేటెస్ట్ గా క్రిష్ణయ్య రాజీనామా చేశారు. సో ఈ మూడు ఎంపీ సీట్లను కూటమిలోని మూడు పార్టీలు పంచుకోవాలని ఒక ప్రతిపాదన ఎన్డీయే పెద్దలు పెట్టారు అని అంటున్నారు. అంటే టీడీపీకి ఒకటి జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి ఎంపీ సీటు అన్న మాట. టీడీపీ వాటలో మాజీ ఎంపీ గల్లా జయదేవ్, జనసేన కోటాలో మెగా బ్రదర్ నాగబాబు, బీజేపీ కోటాలో కిరణ్ కుమార్ రెడ్డిలను ఎంపిక చేస్తారని అంటున్నారు.

ఇక బీజేపీకి రాయలసీమలో తమ పార్టీని డెవలప్ చేసుకోవాలని ఉంది. దాంతో పాటుగా కిరణ్ మాజీ సీఎం కావడం, సీమలో బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయన మీద ఫోకస్ పెట్టింది అని అంటున్నారు. ఇక చంద్రబాబు కూడా రాయలసీమలో జగన్ ని కట్టడి చేయడానికి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా పంపడానికి చూస్తున్నారు అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే కేంద్ర మంత్రి పదవి కోసం చూస్తూ రాజ్య సభకు రూట్ వేసుకుంటున్నారు. ఇక జనసేన నుంచి నాగబాబు ఎంపీ అయితే ఆయనకు కూడా కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం ఉంది. టీడీపీ నుంచి గల్లా జయదేవ్ కూడా కేంద్రంలో కీలక పాత్ర పోషించాలని చూస్తున్నారు. మరి కేంద్రం ఏపీ మీద ఎలాంటి వ్యూహం రూపొందిస్తుందో ఎవరికి ఏ రకమైన అవకాశం లభిస్తుందో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా 2014 మొదల్ట్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన దగ్గర నుంచి గత పదేళ్ళుగా ఏ అధికారిక పదవినీ అందుకోని కిరణ్ కుమార్ రెడ్డి తన రాజకీయాన్ని పదును పెడుతున్నారు. మరి కమల కిరణం ప్రకాశిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.