Begin typing your search above and press return to search.

రాజం పేటలో నల్లారి కిరణం మెరిసేనా !?

పైగా ఉమ్మడి ఏపీ సీఎం తరువాత పదేళ్ల పాటు ఆయన కనిపించకుండా పోయారు అని అంటారు.

By:  Tupaki Desk   |   14 April 2024 3:42 AM GMT
రాజం పేటలో నల్లారి కిరణం మెరిసేనా !?
X

తన జీవిత కాలంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆ తరువాత కేంద్ర కాంగ్రెస్ పెద్దల దయతో మంత్రి కాకుండానే నేరుగా ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ని జాక్ పాట్ సీఎం అని ప్రత్యర్ధులు ఎద్దేవా చేస్తూ ఉంటారు. కిరణ్ కుమార్ రెడ్డికి మాస్ ఫాలోయింగ్ పెద్దగా లేదు. పైగా ఉమ్మడి ఏపీ సీఎం తరువాత పదేళ్ల పాటు ఆయన కనిపించకుండా పోయారు అని అంటారు.

సరిగ్గా 2024 ఎన్నికలను ముహూర్తంగా చేసుకుని ఆయన రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్ధిగా ఎంపీ సీటుకి గురి పెట్టారు. ఆయనకు రాజం పేట సీటు ఎలాంటి ఫలితం ఇస్తుంది అన్నది చర్చగా ఉంది. ఈ సీటులో బీజేపీకి బలం ఏమీ లేదు. 2014లో కూటమి తరఫున ఇక్కడ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆనాడు కూటమికి మంచి వేవ్ ఉన్న తరుణంలో ఆమె ఓటమి కావడం విశేషం.

రాయలసీమ పరిధిలోని ఈ సీటులో టీడీపీ కూడా ఇప్పటికి గెలిచి పాతికేళ్ళు పై దాటింది. ఆ పార్టీ పెట్టాక కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచింది. రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె, పుంగనూరు ఉన్నాయి. ఈ ఏడింటిలో చూస్తే కనుక ఒక్క పీలేరులో మాత్రమే టీడీపీ బలంగా ఉంది అని చెప్పవచ్చు.

ఇక ఆరు అసెంబ్లీ సీట్లలో టీడీపీకే బలం పెద్దగా లేదు అని అంటున్నారు. దాంతో నల్లారి వారికి ఈ సీటులో గెలుపు కత్తి మీద సాము అని అంటున్నారు. ఇక రాజంపేటలో రెండు సార్లు ఎంపీగా పనిచేసిన వైసీపీ సిట్టింగ్ ఎంపీ మిధున్ రెడ్డి బలమైన నేతగా ఉన్నారు. ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నల్లారి కుటుంబానికి మధ్య నాలుగు దశాబ్దాల రాజకీయ వైరం ఉంది.

దాంతో ఇపుడు డైరెక్ట్ గా ఈ రెండు కుటుంబాలు ఢీ కొడుతున్నారు. నల్లారి వారిని ఓడించి తీరుతామని వైసీపీ శపధం పడుతోంది. అంతే కాదు ఆయన కేవలం తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి విభజనకు కారకుడు అయ్యారని వైసీపీ నేతలు విమర్శలు చేశారు. లాస్ట్ బాల్ అంటూ ఏపీ ప్రజలను తప్పు తోవ పట్టించారు అని కూడా ఆరోపిస్తున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే రాజకీయంగా ఇప్పటిదాకా జనంలోకి పెద్దగా రాని కిరణ్ కి రాజంపేట టికెట్ ఇచ్చి బీజేపీ బిగ్ టెస్ట్ పెట్టింది అని అంటున్నారు. ఆయన మాజీ సీఎం అని భావించే బీజేపీ టికెట్ ఇచ్చింది. కానీ ఆయన గెలుపు మీద సొంత పార్టీలోనే డౌట్లు ఉన్నాయని అంటున్నారు.

ఇక చూస్తే 2014లో కూటమి నుంచి తలపడితేనే ఏకంగా లక్ష 74 వేల ఓట్ల తేడాతో వైసీపీ ఓడించింది. ఆ మెజారిటీ 2019 నాటికి వైసీపీకి మరో లక్ష దాకా పెరిగిపోయింది. ఈసారి రెండు లక్షల 68 వేల ఓట్ల పై చిలుకు వైసీపీకి దక్కాయి. దాంతో హ్యాట్రిక్ కొడతామని మిధున్ రెడ్డి అంటున్నారు. ఆయన దూకుడు రాజకీయం చేస్తారు. దాంతో పాటు అంగబలం అర్ధబలం నిండుగా ఉన్నాయి. దాంతో వైసీపీ పక్కా సీటు రాజంపేట అంటున్నారు.

మరో వైపు చూస్తే నల్లారి వారు తనదైన వ్యూహాలకు పదును పెట్టాల్సి ఉంది అని అంటున్నారు. ఆయన వర్గం అంతా కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి వైసీపీలో సర్దుకున్నారు. దాంతో ఆయనకు ఇపుడు టీడీపీ క్యాడర్ లీడర్ తోనే పెద్ద పని ఉందని అంటున్నారు. బీజేపీ విషయంలో రాయలసీమ సెగ్మెంట్ లో మైనారిటీలు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం మాజీ సీఎం కి బిగ్ టాస్క్ గా రాజంపేట సీటు ఉందని అంటున్నారు. ఆరు పదుల వయసు దాటిన కిరణ్ కి ఇది ఒక విధంగా రాజకీయంగా గోల్డెన్ చాన్స్ అని అంటున్నారు.

ఆయన కనుక ఈసారి గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి దక్కుతుంది. దాంతో మరిన్నాళ్ళు ఆయన రాజకీయం ముందుకు సాగుతుంది. ఓడితే మాత్రం లాస్ట్ బాల్ టార్గెట్ రీచ్ కాలేదు అనుకోవడం తప్ప మరేమీ లేదని అంటున్నారు. చూడాలి నల్లారి కిరణం రాజంపేటలో మెరుస్తుందా లేదా అన్నది.