Begin typing your search above and press return to search.

ఎన్నికల్లో ఓడినా ఈ నేతకు కీలక పదవి!

వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి.. కిరణ్‌ కుమార్‌ రెడ్డిపై విజయం సాధించారు.

By:  Tupaki Desk   |   17 Jun 2024 7:30 AM GMT
ఎన్నికల్లో ఓడినా ఈ నేతకు కీలక పదవి!
X

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చిట్టచివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు.. నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి. ఇటీవల ఎన్నికల్లో వైఎస్సార్‌ జిల్లా రాజంపేట లోక్‌ సభా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి.. కిరణ్‌ కుమార్‌ రెడ్డిపై విజయం సాధించారు.

ఎన్నికల్లో ఓడినప్పటికీ కిరణ్‌ కుమార్‌ రెడ్డికి కీలక పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఆయనను తెలంగాణ గవర్నర్‌ గా బీజేపీ అధిష్టానం నియమించనుందని అంటున్నారు.

ప్రస్తుతం తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్‌ లేరు. సీపీ రాధాకృష్ణన్‌ ఇంచార్జి గవర్నర్‌ గా ఉన్నారు. ఆయన ప్రస్తుతం జార్ఖండ్‌ కు గవర్నర్‌ గా వ్యవహరిస్తూనే తెలంగాణ ఇంచార్జి గవర్నర్‌ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల ముందు వరకు తమిళనాడుకు చెందిన తమిళ సై సౌందర్‌ రాజన్‌ తెలంగాణ గవర్నర్‌ గా వ్యవహరించారు. అయితే ఆమె లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చే యడానికి తన గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఎన్నికల్లో దక్షిణ చెన్నై నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఈ నేపథ్యంలో తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్‌ ను నియమించే పనిలో బీజేపీ అధిష్టానం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఏపీ శాసనసభ స్పీకర్‌ గా, చీఫ్‌ విప్‌ గా గతంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన కిరణ్‌ కుమార్‌ రెడ్డిని ఇందుకు ఎంచుకుందని టాక్‌ నడుస్తోంది.

అందులోనూ కిరణ్‌ కుమార్‌ రెడ్డి బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. ప్రస్తుతం తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీతో కలిసి నడుస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా తెలంగాణలో బలమైన రెడ్డి సామాజికవర్గాన్ని తమ వైపుకు తిప్పుకోవడానికి బీజేపీ అధిష్టానం ప్రయత్నిస్తోందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన కిరణ్‌ కుమార్‌ రెడ్డికి గవర్నర్‌ పదవిని కట్టబెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆయన అనుభవం, సామాజిక నేపథ్యం తమకు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తోంది. కిరణ్‌ కుమార్‌ రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందినవారు అయినప్పటికీ ఆయన విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌ లోనే సాగింది.

గతేడాది డిసెంబర్‌ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఇక తాజాగా పార్లమెంటు ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలను కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేయడంలో భాగంగా కిరణ్‌ కుమార్‌ రెడ్డికి గవర్నర్‌ పదవిని కట్టబెట్టాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది.