వందే భారత్ కు మించి నమో భారత్!
ఇదిలా ఉంటే.. దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రీజనల్ రైల్ ను 'నమో భారత్' పేరుతో అందుబాటులోకి తెస్తున్నారు.
By: Tupaki Desk | 20 Oct 2023 11:30 AM GMTమోడీ సర్కారులో రైల్వేల దశ తిరిగి పోతుందని.. మొత్తం రైల్వేల రూపురేఖలు మారిపోతాయన్న ప్రచారం జరిగింది. అయితే.. ఆశించినంతగా జరగకున్నా.. వందే భారత్ పేరుతో తీసుకొస్తున్న రైళ్లు మాత్రం రైల్వే ప్రయాణాన్ని మరో దశకు వెళుతున్నాయి. అయితే.. వీటి టికెట్ల ధరలు భారీగా ఉండటంతో సామాన్యులు వీటిల్లో ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది. పేరుకు స్పీడ్ రైళ్లుగా పేర్కొంటున్నప్పటికీ.. వాటికి ఉండే పరిమిత స్టాప్ లతో పాటు.. మొత్తం ప్రయాణ సమయాన్ని లెక్కిస్తే తేడా పెద్దగా లేదన్న విమర్శ ఉంది.
ఇదిలా ఉంటే.. దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రీజనల్ రైల్ ను 'నమో భారత్' పేరుతో అందుబాటులోకి తెస్తున్నారు. ర్యాపిడ్ ఎక్స్ గా పిలిచే ఈ తొలి సెమీ హైస్పీడ్ రైలు దేశ రాజధాని ప్రాంత ప్రజలకు రేపటి (శనివారం) నుంచి అందుబాటులోకి వస్తోంది. ఈ రోజు (శుక్రవారం) దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ రైలును ప్రారంభించనున్నారు. ఎన్ సీఆర్ వాసులకు అందుబాటులోకి వస్తున్న ఈ రైలు మొత్తం 82 కిలోమీటర్ల మేర ప్రయాణించనుంది. అయితే.. ప్రస్తుతానికి 17కి.మీ. మాత్రమే తయారు కాగా.. ఆ దూరంలోనే రైళ్లను నడపనున్నారు.
ఈ కొత్త రైలుతో ఢిల్లీ - గాజియాబాద్ - మీరట్ ప్రాంతాల్ని కనెక్టు చేయనుంది. సాహిబాబాద్ - దుహై స్టేషన్ల మధ్య ఉన్న కారిడార్ ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.ఈ ర్యాపిడ్ ఎక్స్ హై స్పీడ్ రైల్వే వ్యవస్థలో విశేషాలెన్నో. నమో భారత్ రైళ్ల కారణంగా దేశ రాజధాని వాసుల ప్రయాణ సమయం మూడో వంతు మేర తగ్గనుంది. ప్రయోగాల సమయంలోనే ర్యాపిడ్ ఎక్స్ రైళ్లు గంటకు 160కి.మీ. వేగాన్ని సులువుగా అందుకుంటాయి.
ఒక్కో రైల్లో ఆరు కోచ్ లు ఉంటాయి. మొత్తంగా 1700 మంది ప్రయాణించే వీలుంది. ఇందులో ఒక కోచ్ ను మహిళలకు కేటాయించారు. వీరే కాదు.. దివ్యాంగులు.. పెద్ద వయస్కులకు ప్రత్యేకంగా సీట్లను కేటాయిస్తారు. రెండు వరుసల్లో వరుసకు రెండుచొప్పున సీట్లు ఉండటమే కాదు.. నిలుచొని ప్రయాణించేందుకు విశాలమైన స్థలం అందుబాటులోకి రానుంది.
అత్యాధునిక హంగులు ఈ రైళ్ల సొంతం. ల్యాప్ టాప్.. మొబైల్ చార్జింగ్ పాయింట్లు.. లగేజ్ ర్యాక్ లతో పాటు లైటింగ్ ను అవసరానికి అనుగుణంగా మార్చుకునే వీలుంది. రైల్వేసహాయకులతో పాటు.. స్నాక్స్.. డ్రింక్స్ ను కొనేందుకు వీలుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉండనుంది.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా.. భవిష్యత్తులో ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు నడిపే వీలుంది. అన్నీ బాగున్నాయి. మరి.. టికెట్ ధరల మాటేమిటి? అన్నవిషయంలోకి వస్తే.. స్టాండర్డ్ కోచ్ లో రూ.20-40 వరకు, ప్రీమియం కోచ్ లో రూ.40-100 వరకు టికెట్ ధర ఉంటుంది. ఇందులోని ప్రతి స్టేషన్ ను అందంగా.. ఆకర్షణీయంగా సిద్ధం చేశారు. మొత్తంగా సరికొత్త రైలు ప్రయాణ అనుభూతిని పెంచటంతో పాటు.. తక్కువ వ్యవధిలో గమ్యస్థానాన్ని చేరుకునే వసతి నమో భారత్ రైళ్లతో అందుబాటులోకి రానుంది.