Begin typing your search above and press return to search.

ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డికి బిగ్ షాక్!

ఓటుకు నోటు అంశం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది.

By:  Tupaki Desk   |   24 Sep 2024 10:58 AM GMT
ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డికి బిగ్ షాక్!
X

ఓటుకు నోటు అంశం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్‌కు అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి డబ్బులు ఎర చూపారని ఆరోపణలు వచ్చాయి. దానిపై వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దాంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడంతోపాటు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతరం జైలుకు తరలించగా.. బెయిల్‌పై తిరిగి వచ్చారు.

అయితే.. ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసే క్రమంలో రేవంత్ వద్ద రూ.50 లక్షలతో కూడిన బ్యాగు ఉంది. అంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడంతో వెంటనే ఏసీబీ అధికారులు ఈడీకి రెఫర్ చేశారు. ఆ తదుపరి ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఓటుకు నోటు కేసులో ఏసీబీతోపాటు ఈడీ కూడా విచారణ నడిపిస్తున్నాయి. ఈ కేసులో మరో నిందితుడు అయిన జెరూసలెం మత్తయ్య ఒక్కరే ఇటు ఏసీబీ, అటు ఈడీ కేసులో విచారణకు హాజరవుతున్నారు. మిగితా ఎవరూ అటెండ్ అవ్వడం లేదు. నిత్యం విచారణ నుంచి మినహాయింపు కోరుతూ వస్తున్నారు. ఈ రోజు కూడా జరిగిన విచారణకు కేవలం మత్తయ్య ఒక్కరే హాజరయ్యారు. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ విచారణ నిమిత్తం కోర్టుకు రాలేదు. దీంతో నాంపల్లి కోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

దీంతో వారందరికీ నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఈరోజు విచారణ వరకు మినహాయింపు ఇస్తున్నామని, తదుపరి విచారణకు తప్పకుండా హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. వచ్చేనెల 16వ తేదీకి విచారణ వాయిదా వేయగా.. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ సహా మిగితా నిందితులు తప్పకుండా కోర్టుకు రావాలని స్పష్టం చేసింది.

గతంలో ఏసీబీ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఆ కేసులో న్యాయస్థానం తీర్పునిచ్చింది. వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు అంగీకరించలేదు. మరోవైపు.. ఈ కేసులో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని రేవంత్ రెడ్డికి సూచించింది. తాజాగా.. నాంపల్లి కోర్టు ఆదేశాలతో వచ్చేనెల 16న రేవంత్ రెడ్డితోపాటు మిగితా నిందితులు కోర్టుకు హాజరవుతారా లేదా అని ఉత్కంఠ కనిపిస్తోంది. ఒకవేళ హాజరైతే కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందని అందరిలోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది.