కేంద్రపాలిత ప్రాంతంగా ముంబై: కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు!
హఠాత్తుగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని నానా పటోలే వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 12 Sep 2023 6:04 AM GMTమహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముంబైని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి ప్రయత్నిస్తోందని బాంబుపేల్చారు. సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న పార్లమెంటు సమావేశాల వెనుక బీజేపీకి పెద్ద ప్రణాళికే ఉందన్నారు.
హఠాత్తుగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని నానా పటోలే వ్యాఖ్యానించారు. దేశాన్ని విభజించడంతో పాటు ముంబై నగరాన్ని మహారాష్ట్ర నుంచి విడగొట్టి, కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎజెండాతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రతిపక్షాలు, పార్లమెంట్ వ్యవహారాల కమిటీతో సహా ఏ పార్టీతో సంప్రదింపులు చేయకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసిందని నానా పటోలే ఆరోపించారు.
దేశంలో నోట్ల రద్దు, కోవిడ్–19 సంక్షోభం, మణిపూర్ హింసాకాండ వంటి అంశాలపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఎందుకు నిర్వహించలేదని నానా పటోలే నిలదీశారు. దేశ ఆర్థిక రాజధానిగా ముంబై నగరానికి ప్రపంచ ప్రాముఖ్యత ఉందని ఆయన గుర్తు చేశారు. అలాంటి నగరాన్ని అన్ని విధాలుగా దెబ్బకొట్టాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
ఈ నేపథ్యంలో ముంబైలోని సంస్థలు, కార్యాలయాలను బీజేపీ సర్కార్ మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు తరలిస్తోందని హాట్ కామెంట్స్ చేశారు.
ఈ కుట్రలో భాగంగానే బాంబే స్టాక్ ఎక్సేంజీ, నేషనల్ స్టాక్ ఎక్సేంజీని గుజరాత్ కు తరలించాలనే ప్లాన్ లో ప్రధాని మోడీ ఉన్నారని నానా పటోలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు, దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చడం, జమ్ముకాశ్మీర్ కు రాష్ట్ర ప్రతిపత్తి తదితర అంశాలపై చర్చిస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ప్రధానంగా 'ఒకే దేశం– ఒకే ఎన్నికలు’, 'దేశం పేరు మార్పు' అంశాలే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అజెండాగా ఉంటాయని వార్తలు వచ్చాయి.
అయితే కాంగ్రెస్ నేత నానా పటోలే మాత్రం బీజేపీ పార్లమెంటు సమావేశాలు నిర్వహించడం వెనుక ముంబైని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనే కుట్ర దాగి ఉందంటూ బాంబుపేల్చారు. పటోలే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.