Begin typing your search above and press return to search.

టీటీడీపీ పగ్గాలు జూ.ఎన్టీఆర్ ఫ్యామిలీకే.. చంద్రబాబు నయా వ్యూహం

తెలంగాణలో మళ్లీ పుంజుకోవాలని టీడీపీ చాలా కాలంగా ప్లాన్ చేస్తోంది. తగిన సమయం కోసం ఎదురుచూస్తోంది.

By:  Tupaki Desk   |   31 March 2025 11:27 AM
టీటీడీపీ పగ్గాలు జూ.ఎన్టీఆర్ ఫ్యామిలీకే.. చంద్రబాబు నయా వ్యూహం
X

టీడీపీ 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖాళీగా ఉన్న తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిని నందమూరి కుటుంబానికి అప్పగించాలని అధినేత ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంలో చురుకైన మహిళా నేతకు తెలంగాణ టీడీపీ అధ్యక్షురాలిని చేయడం ద్వారా గత వైభవాన్ని పునరుద్ధరించుకోవాలని చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారంటున్నారు.

తెలంగాణలో మళ్లీ పుంజుకోవాలని టీడీపీ చాలా కాలంగా ప్లాన్ చేస్తోంది. తగిన సమయం కోసం ఎదురుచూస్తోంది. రాష్ట్రవిభజన తర్వాత పూర్తిగా ఉనికి కోల్పోయిన దశకు చేరుకున్న టీడీపీ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత తన పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకోవాలని ఉబలాటపడుతోంది. ఇదే సమయంలో ఏపీలో తిరుగులేని అధికారం దక్కడంతో తెలంగాణలో మళ్లీ పుంజుకోవాలనే టీడీపీ నేతల ఆలోచనలకు మరింత శక్తి వచ్చినట్లైంది. అంతేకాకుండా బీఆర్ఎస్ నుంచి మాజీ మేయర్ తీగల క్రిష్ణారెడ్డి వంటి సీనియర్లు టీడీపీలో చేరడంతో టీ.టీడీపీ భవిష్యత్ కార్యాచరణపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి.

గతంలో తెలంగాణ టీడీపీ అంటేనే ఉలిక్కిపడే నేతలు ఇప్పుడు టీడీపీపై ఆసక్తి పెంచుకోడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు. ఏపీలో అధికారంలో ఉండటం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగడానికి టీడీపీయే ప్రధాన బలం కావడంతో తెలంగాణ టీడీపీలో చేరికకు చాలామంది ఉత్సాహం ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని కోరి అడిగితే ముఖం చాటేసిన నేతలు ఇప్పుడు ఇస్తే గిస్తే అధ్యక్ష పదవే కావాలంటూ పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదేసమయంలో బీఆర్ఎస్ నుంచి టీడీపీలో చేరికకు సుముఖంగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా తెలంగాణ టీడీపీ అధ్యక్ష రేసులో ఉన్నట్లు చెబుతున్నారు.

అయితే టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నాయని చెబుతున్నారు. నారా, నందమూరి కుటుంబంలోని వారైతేనే తెలంగాణలో టీడీపీ పునరుత్తేజం తెచ్చుకునే వీలుందని భావిస్తున్న చంద్రబాబు.. ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంపై ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నా, ఆయన సోదరి నందమూరి సుహాసిని మాత్రం టీడీపీలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. 2018 ఎన్నికల్లో టీడీపీ తరుఫున కూకట్ పల్లి ఎమ్మెల్యేగానూ పోటీ చేశారు. ఎన్టీఆర్ కుమారుడు హరిక్రిష్ణ కుమార్తెగా సుహాసినికి తెలంగాణలో గుర్తింపు ఉంది. ఆమెను కొత్త అధ్యక్షురాలు చేస్తే ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించవచ్చని, టీడీపీ నుంచి వెళ్లిన నేతలు కూడా ఘర్ వాపసీ కింద వెనక్కి రావాలని పిలవొచ్చని ఆ పార్టీ హైకమాండ్ భావిస్తోంది.

ప్రస్తుతం టీడీపీ అధ్యక్ష రేసులో మాజీ హోంమంత్రి దేవందర్ గౌడ్ మేనల్లుడు అరవింద్ కుమార్ గౌడ్ పేరు ప్రచారంలో ఉంది. ఎప్పటినుంచో ఆయన పార్టీని నమ్ముకునే ఉన్నారనే సానుభూతి కూడా ఉంది. అయితే ఆయన విషయంలో చంద్రబాబు సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో సుహాసిని అయితేనే బెటర్ అనే ఆలోచన చేస్తున్నారంటున్నారు. మొత్తానికి కొద్దిరోజుల్లో తెలంగాణ టీడీపీ పీఠంపై నందమూరి వారసురాలు మెరిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.