Begin typing your search above and press return to search.

బాబు అరెస్ట్ పై బాలయ్య ఉగ్రరూపం... జగన్ ఏమి తింటున్నాడంటే...?

చంద్రబాబు అరెస్ట్ విషయంలో స్పందించిన బాలకృష్ణ... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు

By:  Tupaki Desk   |   9 Sep 2023 6:26 AM GMT
బాబు అరెస్ట్ పై బాలయ్య ఉగ్రరూపం... జగన్ ఏమి తింటున్నాడంటే...?
X

ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కు సంబంధించి ఏ1 నిందితుడిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును శనివారం ఉదయం ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం వైద్యపరీక్షలు చేయించి నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు! ఈ సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సమయంలో బాలకృష్ణ స్పందించారు.

అవును... తన బావ, టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయంపై టీడీపీ నేత, హిందూపుర్ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. జగన్ పాలకుడు కాదు కక్ష్యదారుడు అంటూ తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు దుర్మార్గం అంటూ ఫైరయ్యారు! అనంతరం ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు!

చంద్రబాబు అరెస్ట్ విషయంలో స్పందించిన బాలకృష్ణ... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నం తినటం మానేశారని.. కేవలం కోర్టుల చేత చివాట్లు మాత్రమే తింటున్నారని కామెంట్ చేశారు. ఈ సందర్భంగా జగన్ కు ఒక జీవిత లక్ష్యం ఉందంటూ చెప్పుకొచ్చారు బాలయ్య.

ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ప్రతిపక్షనేతలపై కక్ష్యసాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యం అంటూ ఫైరయిన బాలయ్య... తాను 16 నెలలు జైల్లో ఉన్నాను కాబట్టి, చంద్రబాబుని కనీసం 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలన్నదే జీవిత లక్ష్యంగా పెట్టుకున్న జగన్ ఆ మేరకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ఇదే క్రమంలో ఇది కావాలని రాజకీయ కక్ష్యతో చేస్తున్న కుట్రలో భాగం మాత్రమే అని చెప్పిన బాలయ... 2021 డిసెంబర్ 19లో ఎఫ్‌ఐఆర్ నమోదైందని.. నిజంగా ఇందులో అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు ఎందుకు చార్జ్ సీటు వేయలేదని తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. సుమారు రెండు లక్షల మంది విద్యార్దులకు శిక్షణ ఇచ్చి, దాదాపు 72 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఈ ప్రాజెక్ట్ ని కుంభకోణం అని ఏ విధంగా అంటారని కోర్టు ప్రశ్నించలేదా అంటూ బాలయ్య మండిపడ్డారు.

ఇదే సమయంలో... ఎలాంటి అవినీతి లేనటువంటి ఈ కేసులో రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారని, అంతకు మించి మరొకటి కాదని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదని.. దీనిపై న్యాయపోరాటం చేస్తామని.. ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని బాలకృ‌ష్ణ తెలిపారు.