Begin typing your search above and press return to search.

రాష్ట్రానికి రావణ పాలక.. దేశానికి దరిద్ర జాతక: జగన్‌ పై బాలకృష్ణ నిప్పులు!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు

By:  Tupaki Desk   |   12 Sep 2023 7:00 AM GMT
రాష్ట్రానికి రావణ పాలక.. దేశానికి దరిద్ర జాతక: జగన్‌ పై బాలకృష్ణ నిప్పులు!
X

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రావణ పాలక.. దేశానికి దరిద్ర జాతకుడిలా మన ముఖ్యమంత్రి ఉన్నారని నిప్పులు చెరిగారు. ''లక్షల కోట్ల అవినీతి భక్షక.. అవినీతి అర్భక.. పక్షపాత రూపక.. ముఖ్య మహా కంత్రి మూర్ఖ.. మూతి ముదష్టక.. జగమెరిగిన జగన్నాటక.. ఈ దేశానికి పట్టిన దరిద్ర జాతక.. రాష్ట్రానికి రావణ పాలక.. జన, ధన, మాన చోరక మన ముఖ్యమంత్రి'' అంటూ తీవ్ర స్థాయిలో బాలయ్య ధ్వజమెత్తారు.

తాను 16 నెలలు జైలులో ఉన్నాను కాబట్టి.. చంద్రబాబును కూడా 16 రోజులైనా జైలులో పెట్టాలన్నట్టు జగన్‌ వ్యవహరిస్తున్నారని బాలకృష్ణ మండిపడ్డారు. ఏ ఆధారాలు లేకుండా కుట్రపూరితంగానే చంద్రబాబును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టు చేశారని ఆరోపించారు. చట్టాలను అతిక్రమించి, అవినీతి చేశారని అభూత కల్పనలు సృష్టించి చంద్రబాబును అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి చంద్రబాబు బ్రాండ్‌ అని తెలిపారు. మన రాష్ట్రం వారే కాకుండా వివిధ దేశాలు కూడా చంద్రబాబు గురించి చెప్పుకుంటాయన్నారు.

2013 నుంచే సీమెన్స్‌ గుజరాత్‌ లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ లో శిక్షణ ఇచ్చిందన్నారు. ఆ తర్వాత ఏపీలో నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి తదితరులు ప్రతిపాదనతో వస్తేనే నాడు చంద్రబాబు సీఎంగా ఓకే అన్నారని గుర్తు చేశారు. అజేయ కల్లం రెడ్డి, ప్రేమచంద్రారెడ్డిలే నాడు ఆయా శాఖల కార్యదర్శులుగా ఉన్నారని బాలకృష్ణ గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి తప్ప ఎన్టీఆర్‌ కు, చంద్రబాబుకు మరో పని ఉండేది కాదన్నారు.

టీడీపీ ఇప్పటివరకు ఎన్నో సంక్షోభాలను చూసిందని బాలకృష్ణ చెప్పారు. ప్రస్తుత పరిణామాలను చూసి బెదిరిపోమన్నారు. 1984లో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేశారని గుర్తు చేశారు. ఇలా ఎన్నో సంక్షోభాలను టీడీపీ చూసిందన్నారు.

తెలుగువాళ్ల ఉనికిని ప్రపంచానికి చాటిందని ఎన్టీఆర్‌ అని బాలయ్య గుర్తు చేశారు. సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ఆయన చేసి చూపించారని తెలిపారు. ఆ తర్వాత ఆ ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. హిందూపురంలో తాము ప్రభుత్వ ఆస్పత్రిని కార్పొరేట్‌ ఆస్పత్రి స్థాయిలో అభివృద్ధి చేశామన్నారు. ఇందుకు రూ.23 కోట్లు ఖర్చు చేశామన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక పందులు, కుక్కలు అందులో తిరుగుతున్నాయన్నారు. మంత్రికి కూడా తాను చెప్పానని.. వెటర్నరీ ఆస్పత్రిని చూడాలని కోరానని తెలిపారు. మెటర్నరీ ఆస్పత్రి కదా అని మంత్రి అన్నారని.. మీ హయాంలో మెటర్నరీ ఆస్పత్రి కాస్తా వెటర్నరీ ఆస్పత్రిగా మారిందని చెప్పానని బాలయ్య తెలిపారు.

ప్రజలంతా ఇప్పుడు ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని.. ఎవరూ ఏం చేయలేరన్నారు. తాను వస్తున్నానని.. ముందుంటానని భరోసా ఇచ్చారు. ఇక నుంచి మన తెలుగువాడి సత్తా ఏంటో, పౌరుషం ఏంటో చూపిద్దామని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

మనహక్కుల కోసం మనం పోరాడాలని బాలయ్య పిలుపునిచ్చారు. చెత్తపై పన్ను వేశారని.. పీల్చే గాలిపై కూడా పన్ను వేస్తారని బాలయ్య సెటైర్లు వేశారు. ఏపీ ప్రజలు దిక్కుతోచని స్థితిలో గందరగోళంలో ఉన్నారన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే వైఎస్‌ జగన్‌ ఇలాంటి పనులకు పాల్పడుతున్నాడని బాలకృష్ణ మండిపడ్డారు. ఓటమి భయంతోనే తప్పుడు కేసులను కుట్రపూరితంగా పెడుతున్నారని ఆరోపించారు. మున్ముందు ఇంకా మరిన్ని కేసులు పెడతారని తెలిపారు. చంద్రబాబు కడిగిన ఆణిముత్యంలా బయటకు వస్తారని బాలయ్య ధీమా వ్యక్తం చేశారు.

టిడ్కో ఇళ్లను టీడీపీ హయాంలో నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్కరికీ ఇచ్చిన దాఖలాలు లేవని బాలయ్య మండిపడ్డారు. గంజాయికి యువతను బానిసలు చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో హిందూపూర్‌ లో పాలిటెక్నిక్‌ కాలేజీలు, ఐఐటీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లు, మహిళా డిగ్రీ కాలేజీ, మహిళా పాలిటెక్నిక్‌ కాలేజీ నిర్మించామని గుర్తు చేశారు.

ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ, ఇతర దేశాల్లో కానీ తెలుగువాళ్లు ముందంజలో ఉన్నారని తెలిపారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందని నిలదీశారు. జగన్‌ ఏపీని ప్రపంచ పటంలో లేకుండా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో హైదరాబాద్‌ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు.