Begin typing your search above and press return to search.

నేను వస్తున్నా.. గెట్ రెడీ...బాలయ్య గర్జన

ఇపుడు బాబు గారి బావమరిది కం వియ్యంకుడు అయిన బాలయ్య అదే మంగళగిరి ఆఫీసులో మీడియా మీటింగ్ పెట్టారు

By:  Tupaki Desk   |   12 Sep 2023 7:13 AM GMT
నేను వస్తున్నా.. గెట్ రెడీ...బాలయ్య గర్జన
X

చంద్రబాబు జైలులో ఉన్నారు. ఆయన తరువాత నంబర్ టూ ఎవరు అన్నది ఇప్పటిదాకా తెలియదు. నారా లోకేష్ కుమారుడిగా పాటీలో కీలకం అయినా సరే చాలా మందికి ఆశలు ఉన్నాయని తెలుస్తోంది. బాబు అరెస్ట్ అయి జైలులోకి వెళ్లగానే సీనియర్లు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. యనమల రామక్రిష్ణుడు పార్టీ సమీక్ష పేరుతో మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఒక మీటింగ్ పెట్టారు.

ఇపుడు బాబు గారి బావమరిది కం వియ్యంకుడు అయిన బాలయ్య అదే మంగళగిరి ఆఫీసులో మీడియా మీటింగ్ పెట్టారు. మంగళగిరి పార్టీ ఆఫీసు వేదికగా బాలయ్య ఇలా మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి అని అంటున్నారు. బాలయ్య హిందూపురం నుంచి రెండు సార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే, అంతే కాదు పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్. కానీ పార్టీ మీటింగ్స్ లో ఎపుడూ ఆయన తక్కువగానే కనిపిస్తారు అని ప్రచారంలో ఉంది.

ఇపుడు బాలయ్య ప్రెస్ మీట్ పెట్టి జగన్ సర్కార్ మీద ఒక రేంజిలో రైజ్ అయ్యారు. లక్ష కోట్లు తిన్నారని విమర్శించారు. రావణ పాలన అన్నారు. ప్రపంచ పటంలో ఏపీని లేకుండా చేశారని నిందించారు. అభివృద్ధి అంతా చంద్రబాబు వల్లనే జరిగిందని కూడా చెప్పుకొచ్చారు. ఇక తాను ప్రజలకు పార్టీకి అండగా ఉంటాను అని ఒక గట్టి సందేశం పంపినంచారు.

నిజయాతీపరుడైన చంద్రబాబుని కేసుల పేరుతో అరెస్ట్ చేసి వేధిస్తున్నారు అని బాలయ్య అంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో దాదాపుగా పదమూడు మంది దాకా ఏపీలో గుండె ఆగి మరణించారని, అలాగే చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని వారందరికీ తాను తోడుగా ఉంటానని బాలయ్య హామీ ఇచ్చారు. తాను ప్రతీ కుటుంబాన్ని పరామర్శిస్తానని వారికి తాను తోడుగా ఉంటాను అన్నారు.

అంతే కాదు ఏపీ ప్రజలకు కూడా తాను తోడుగా ఉంటానని బాలయ్య చెప్పడం విశేషం. 1984లో వచ్చిన మాదిరిగానే ప్రజా పోరాటం రావాలని బాలయ్య అంటున్నారు. ఈ అన్యాయాన్ని అంతా ఎదిరించాలని ఆయన కోరుతున్నారు. తాను ప్రజలలోకి వస్తున్నాను అని వైసీపీకి బాలయ్య చెప్పడం అంటే ఆయన ఏ విధంగా వస్తారు. ఆయన ఏమి కోరుకుంటున్నారు అన్న చర్చ కూడా వెంటనే మొదలైంది.

బాలయ్య సినీ నటుడు, అంతకి మించి అన్న గారికి కుమారుడు. నందమూరి బ్లడ్ గా ఎటూ ఆయనకు టీడీపీలో ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా బాలయ్య ఇపుడు బాబు తరఫున టీడీపీకి పెద్దగా జనంలోకి రాబోతున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. చంద్రబాబు వంటి పెద్ద దిక్కు ఇపుడు జైలులో ఉన్నాక టీడీపీకి దిశా నిర్దేశం కరవు అయింది. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు నిజానికి ఈ టైం లో పార్టీని లీడ్ చేయాలి.

అయితే ఫక్తు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీలో బాబు తరువాత అంటే పార్టీలో సీనియర్ల కంటే అటు కుమారుడు ఇటు బావమరిదినే ముందుకు పెడుతున్నారు. నిన్నటికి నిన్న లోకేష్ రాజమండ్రీలో ప్రెస్ మీట్ పెట్టి ప్రజల అండ కోరుకున్నారు. వెనువెంటనే ఈ రోజు బాలయ్య ఏకంగా పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ప్రెస్ మీట్ పెట్టి తానే జనంతో ఉంటాను అంటున్నారు. ఇది నిజంగా టీడీపీకి మంచిదే అనుకున్నా అంతా కలసి వస్తారా లేక విడి విడిగా వస్తారా అన్నది చూడాలి. మరో వైపు టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉన్నారు.

వారు ఎలా ఈ సమయంలో రియాక్ట్ అవుతున్నారో చూడాల్సి ఉంది. యనమల అయితే బాబు లేని వేళ పార్టీని ఎలా నడిపించాలి అన్న దాని మీద ఇప్పటికే దిశానిర్దేశం చేసే పనిలో ఉన్నారు. మరి అచ్చెన్నాయుడు ఏ విధంగా పార్టీని లైనప్ చేస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది. ఇంకో వైపు లోకేష్ రాజమండ్రిలో క్యాంప్ చేసి ఉంటే అక్కడికి టీడీపీ ముఖ్య నేతలు అంతా క్యూ కట్టి వెళ్లడమూ చర్చనీయాంశం అయింది.

దీనిని బట్టి చూస్తూంటే ఏదో ఒక గందరగోళం అయితే పార్టీలో ఉంది అని అంటున్నారు. అందరికీ పెద్దాయన చంద్రబాబు ఒక గొడుగుగా ఉంటూ నడిపించడం వల్ల ఇంతకాలం నడచిపోయింది కానీ ఇపుడు చూస్తే మాత్రం టీడీపీలో బాబు వారసుడు ఎవరు అన్న కొత్త చర్చ మొదలైంది అంటున్నారు. లోకేష్ బాలయ్యతో పాటు సీనియర్ లీడర్స్ కూడా పార్టీని లీడ్ చేయాలని ఉబలాటపడుతున్నారా అన్న ప్రచారం కూడా ఉంది.

ఇందులో నిజమెంత అన్నది తెలియదు కానీ బాలయ్య ఈ కీలక సమయంలో నేను వస్తున్నా అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం చర్చకు దారి తీసేలాగానే ఉంది అని అంటున్నారు. దీని మీద వైసీపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు జైలులో ఉంటే పార్టీని పంచుకోవడానికి సీనియర్ నాయకులు ఒక వైపు కుటుంబ సభ్యులు మరో వైపు తయారయ్యారని సెటైర్లు వేశారు.