బాలయ్య.... గుంపులో గోవిందయ్య....టార్గెట్ చేసిన సీనియర్ నేత ...?
నందమూరి బాలక్రిష్ణ ఘనత వహించిన రాజకీయ వారసుడు అని వేరేగా చెప్పాల్సింది లేదు. ఆయన అన్న గారి కుమారుడు
By: Tupaki Desk | 25 Sep 2023 11:48 AM GMTనందమూరి బాలక్రిష్ణ ఘనత వహించిన రాజకీయ వారసుడు అని వేరేగా చెప్పాల్సింది లేదు. ఆయన అన్న గారి కుమారుడు. రెండు సార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గిన బాలయ్య తను ఎంతో గౌరవించిన చంద్రబాబు తరువాత టీడీపీలో తానే పగ్గాలు అందుకోవాలని తలచారు. చంద్రబాబు అరెస్ట్ అవగానే బాలయ్య మంగళగిరి కేంద్ర కార్యాలయంలో బాబు కుర్చీలోనే కూర్చుని మీడియాతో సమావేశం పెట్టారు.
తాను ఇక మీదట జనంలోకి వస్తాను అని కూడా ప్రకటించారు. అదే ఊపులో ములాఖత్ సందర్భంగా ఆయన చంద్రబాబుని జైలులో కలుసుకున్నారు. పవన్ తో బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. అక్కడితో బాలయ్య జోరు ఆగలేదు, అసెంబ్లీలో కూడా వైసీపీ ప్రభుత్వం మీద రెచ్చిపోయారు. స్పీకర్ పోడియం ముందుకు వచ్చారు. మీసాలు తిప్పారు. తొడగొట్టారు, అక్కడ కూడా బాబు సీటే ఎక్కి విజిల్స్ వేశారు.
ఇలా చంద్రబాబు తరువాత టీడీపీని కాపాడేది తానే అన్నట్లుగా ఆయన చేయాల్సింది చేస్తున్నారు. నిజానికి బాలయ్యకు టీడీపీ సారధ్య బాధ్యతలు నిర్వహించాలని కోరిక ఉందని అంటారు. అయితే టీడీపీలో సీనియర్లు మాత్రం మోకాలడ్డుతున్నారు అని అంటున్నారు. బాలయ్య విషయంలో చెప్పాల్సింది చంద్రబాబుకు ఒక సీనియర్ నేత చెప్పారని అంటున్నారు. ఆయన ఇటీవల బాబుని ములాఖత్ సందర్భంగా కలుసుకున్నారు.
ఈ నేపధ్యంలో పార్టీ విషయంలో చర్చ వచ్చింది. దీంతో బాలయ్యకు పగ్గాలు అప్పగించవద్దని సదరు సీనియర్ నేత గట్టిగా చెప్పారని అంటున్నారు. ఎట్టి పరిస్థితులలో బాబు నాయకత్వం వద్దు అని ఆయన బాబుకు చెప్పారని అంటున్నారు. ఒకవేళ బాలయ్యకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే కనుక పార్టీని జగన్ ఓడించాల్సిన అవసరం కూడా ఉండదని సదరు నేత బాబుకు చెప్పారని తెలుస్తోంది.
ఈ విషయంలో బాలయ్య మీద తన వ్యతిరేకతను ఆయన చాలా సీరియస్ గానే బాబు దృష్టికి తెచ్చారని అంటున్నారు. బాలయ్య వయసు పెరిగింది కానీ బుద్ధి వికసించలేదని అంటూ బాలయ్య గురించి కొన్ని విషయాలను కూడా సోదాహరణంగా బాబుకు వివరించారని అంటున్నారు.
ఇక బాబుకు అంత సూటిగా గట్టిగా సొంత బావమరిది కం వియ్యకుడికి చెప్పగలితే తాహతు ధైర్యం సదరు నేతకు ఉందని, అంతే కాదు ఆ నేత అంటే బాబుకు కూడా బాగా గురి అని అంటున్నారు. దాంతోనే బాబు ఆయన చెప్పినట్లుగా వ్యవహరించారని తెలుస్తోంది. పొలిటికల్ యాక్షన్ టీం అని ఒక దాన్ని ప్రకటించారు. అందులో బాలయ్యని జస్ట్ ఆరవ మెంబర్ గా ఉంచారు. మొత్తం పద్నాలుగు మందికి చోటు కల్పించారు
ఇలా ఉమ్మడిగా పార్టీని నడపడమే బెటర్ అన్న సీనియర్ నేత సూచనల మేరకే బాబు ఈ పని చేసారు అని అంటున్నారు. అయితే పొలిటికల్ యాక్షన్ టీం అంటూ ఒకటి ఏర్పాటు అయింది. అందులో బాలయ్య ఆరవ మెంబర్ గా ఉండడం తో ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు అని అంటునారు. టీడీపీలో బాలయ్య ఇపుడు గట్టిగా పోరాడుతున్నారని కానీ పార్టీలోనే గిట్టని వారు ఆయన ఎదుగుదలను ఆపుతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా బాలయ్యను గుంపులో గోవిందయ్యను చేయడంతో సదరు సీనియర్ నేత కీలకంగా వ్యవహరించారు అని అంటున్నారు.