బాలయ్య .. మాటలు పేలాయయ్యా!
టీడీపీ సీనియర్ నాయకుడు, హిందూపురం ఎంపీ.. నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుత ఎన్నికల్లో ఐకాన్ నాయకుడిగా మారారు
By: Tupaki Desk | 16 April 2024 5:15 AM GMTటీడీపీ సీనియర్ నాయకుడు, హిందూపురం ఎంపీ.. నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుత ఎన్నికల్లో ఐకాన్ నాయకుడిగా మారారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కూటమి పార్టీల తరఫున 'స్వర్ణాంద్ర సాకార యాత్ర' చేస్తున్నారు. అయితే.. ఈ క్రమంలో ఆయన స్థానిక సమస్యలతోపాటు.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ, ఈ విషయంలో బాలయ్య ఇతర నాయకులకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తొలి రెండు రోజులు సాధారణంగానే ఆయన ప్రసంగించారు.
కానీ, తర్వాత నుంచివ్యూహం మార్చుకున్నారు. తనదైన శైలిలో ప్రాస డైలాగులు, సినిమా డైలాగులతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో బాలయ్య ప్రసంగాలు మాస్ జనాల్లోకి జోరుగా వెళ్తున్నాయని అంటున్నారు టీడీపీ నాయకులు. ప్రజలకు ఇస్తున్న పిలుపులు, ఆయన చేస్తున్న ప్రసంగాలకు ఆదరణ లభిస్తోందని చెబుతున్నారు. తాజాగా ఆయన నందికొట్కూరు నియోజకవర్గంలో పర్యటించి చేసిన ప్రసంగం యూట్యూబ్ సహా సామాజిక మాధ్యాల్లో హైలెట్‌గా నిలిచింది.
"రక్తానికి జాతి లేదు... మాంసానికి మతం లేదు... చర్మానికి కులం లేదు... నాకున్న జ్ఞానసంపదలో బ్రాహ్మణుడ్ని, ఐశ్వర్యంలో వైశ్యుడ్ని, మంచికి మాలను, ఎదురుతిరిగితే మాదిగను, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కుమ్మరిని, కంసాలిని, రజకుడ్ని, నాయి బ్రాహ్మణుడ్ని, కల్లుగీత కార్మికుడ్ని, కల్మషం లేని యాదవుడ్ని, ఆపదలో ఆదుకునే వెలమను, వ్యక్తిత్వంలో రాజును, అమ్మని మరిపించే కమ్మని, పౌరుషం లో రెడ్డిని, భుజబలంలో కాపుని అని మీలో ప్రతి ఒక్కరూ అనుకోవాలి. ఓటు తోనే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి`` అని బాలయ్య చేసిన ప్రసంగంలోని ఈ ముక్క సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం.
ప్రస్తుతం ఇతర నాయకుల ప్రసంగాలు విని.. బోర్ కొడుతున్న సాధారణ ప్రజలకు బాలయ్య ప్రసంగాలు కొంత రిలీఫ్ గా కూడా ఉంటున్నాయి. ఆయన తనదైన శైలిలో చేస్తున్న ప్రసంగాలు.. యువతను ముఖ్యంగా ఆకట్టుకుంటున్నాయి. తెలుగులో చేస్తున్న ప్రయోగాత్మక ప్రసంగాలు బాలయ్యను మరోసారి ఓ రేంజ్‌లో నిలబెడుతున్నాయి. సాధారణంగా రాజకీయ నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటారు. కానీ, బాలయ్య వీటికి సినిమా తరహా డైలాగులు జోడిస్తుండడంతో బాలయ్యా.. మాటలు పేలాయయ్యా! అనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.