రేవంత్ ని కలిసిన నందమూరి సుహాసిని... కాంగ్రెస్ లో కీలక పదవి!!
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
By: Tupaki Desk | 30 March 2024 10:07 AM GMTలోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆరెస్స్ కు చెందిన కీలక నేతలు కారు దిగి, హస్తం కిందకి చేరిపోతుండటంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కిన నేపథ్యంలో... బీఆరెస్స్ నుంచి 12 మంది, బీజేపీ నుంచి 8మంది తమతో టచ్ లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఆ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ఈ సమయంలో తెలంగాణ టీడీపీ నేత నందమూరి సుహాసినీ.. రేవంత్ రెడ్డిని కలిశారు!
అవును... లోక్ సభ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామాల సరసన మరో ఆసక్తికర పరిణామం వచ్చి చేరింది! ఇందులో భాగంగా నందమూరి సుహాసినీ... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్సీ, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో రేవంత్ ని కలిసిన సుహాసిని.. ఆయనకు పుష్కగుచ్ఛం అందించారు.
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు ఏ స్థాయిలో ఉన్నాయనేది తెలిసిన విషయమే. బీఆరెస్స్ నుంచి ఊహించని వ్యక్తులు సైతం హస్తం గూటికి వస్తున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో అనూహ్యంగా టీడీపీ నేత సుహాసినీ... రేవంత్ ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే... కాంగ్రెస్ లో చేరాలని ఫిక్స్ అయిన తర్వాతే ఈ భేటీ జరిగిందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
ఈ సందర్భంగా ఆమెను జీ.హెచ్.ఎం.సీ ఎన్నికల్లో బరిలోకి దించి కీలక పదవి ఇవ్వాలని భావిస్తున్నారని కూడా అంటున్నారు! ఇదే సమయంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఆమెతో ప్రచారం చేయించుకోవాలని.. ఫలితంగా కూకట్ పల్లి, జూబ్లిహిల్స్, ఖైరాతాబ్ పరిధిలోని ఓటర్లను ప్రభావితం చేయడానికి ఉపయోగపడతారని భావిస్తున్నారని తెలుస్తోంది.
కాగా... 2018 ఎన్నికల్లో టీడీపీ తరుపున కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నందమూరి సుహాసిని... 70వేల పైచిలుకు ఓట్లు సంపాదించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో టీడీపీ షట్టర్ ఆల్ మోస్ట్ క్లోజ్ అనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... రాజకీయాలపై ఎంతో ఆసక్తి ఉన్న సుహాసినీ... కాంగ్రెస్ వైపు కదిలారని చెబుతున్నారు! అయితే.. ఈ భేటీకి గల కారణాలకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది!