ఎన్టీఆర్ నాణెం విడుదల... రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు!
అనంతరం ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడారు. ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఉండరని ఆమె చెప్పారు
By: Tupaki Desk | 28 Aug 2023 7:29 AM GMTతెలుగు ప్రజల అభిమాన నటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నందమూరి తారకరామారావు గురించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్ లోని సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం... భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీఆర్ ఎంతో ప్రత్యేకమని.. రాజకీయాల్లోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము అన్నారు.
ఈ సందర్భంగా... రామాయణ మహాభారతాలకు సంబంధించిన అనేక పాత్రలలో ఎన్టీఆర్ జీవించారని.. మనుషులంతా ఒక్కటే అనే సందేశాన్ని తమ సినిమాల్లో ఇచ్చారని రాష్ట్రపతి తెలిపారు. ఇదే సమయంలో రాజకీయాలలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉందని ఆమె కొనియాడారు.
అనంతరం ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడారు. ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఉండరని ఆమె చెప్పారు. మహిళకు ఆస్తిలో హక్కు కల్పించింది ఎన్టీఆర్ అని.. తిరుపతిలో మహిళా వర్సిటీ కూడా ఏర్పాటు చేశారని అన్నారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ రంగాల్లో ఆయనతో కలిసి పనిచేసిన సన్నిహితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు మొదటివరుసలో ఆసీనులయ్యారు!
కాగా... కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న ఎన్టీఆర్ జన్మించారు. స్వయం కృషితో సినీ, రాజకీయ రంగాలపై ఆయన చెరగని ముద్రవేశారు. ఈ సమయంలో ఆయన సమాజానికి అందించిన సేవలకు గుర్తుగా శత జయంతి సంవత్సరం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక రూ.100 నాణేన్ని ముద్రించింది.
44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ నాణేన్ని 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్ తో రూపొందించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన 20 నిమిషాల నిడివి గల లఘుచిత్రాన్ని రాష్ట్రపతి ముందు ప్రదర్శించారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు.