Begin typing your search above and press return to search.

వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేశ్ కు బెయిల్ : ఐదు నెలల తర్వాత జైలు నుంచి..

దీంతో ఐదు నెలల తర్వాత మాజీ ఎంపీ సురేశ్ జైలు నుంచి బయటకు రానున్నారు.

By:  Tupaki Desk   |   28 Jan 2025 2:40 PM GMT
వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేశ్ కు బెయిల్ : ఐదు నెలల తర్వాత జైలు నుంచి..
X

బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగాం సురేశ్ కు పెద్ద ఊరట దక్కింది. దళిత మహిళ హత్య కేసులో రిమాండ్ ఖైదీగా గుంటూరు జైలులో ఉన్న ఆయనకు మంగళవారం సాయంత్రం బెయిల్ లభించింది. దీంతో ఐదు నెలల తర్వాత మాజీ ఎంపీ సురేశ్ జైలు నుంచి బయటకు రానున్నారు.

గత ప్రభుత్వంలో కీలక నేతగా చక్రం తిప్పిన మాజీ ఎంపీ సురేశ్ కు కూటమి ప్రభుత్వం రాగానే కష్టాలు మొదలయ్యాయి. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఐదు నెలల క్రితం ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ తెచ్చుకున్న వెంటనే.. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో చోటుచేసుకున్న హత్య కేసును తెరపైకి తెచ్చారు. ఈ కేసులో దళిత మహిళను హత్య చేసినట్లు మాజీ ఎంపీపై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ వచ్చినా ఆయన జైలులోనే ఉండిపోయారు.

ఇక దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో మాజీ ఎంపీ నందిగాం సురేశ్ 78వ నిందితుడిగా ఉన్నారు. గ్రామంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ హత్యకు గురయ్యారు. దీనిపై గత ప్రభుత్వంలోనే హతురాలి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి అరెస్టులు జరగలేదు. దీంతో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బారులో హతురాలి కుమారుడు ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ ఎంపీ నందిగాం సురేశ్ పై చర్యలకు ఆయన పోలీసులను ఆదేశించారు.

ఐదు నెలల క్రితం జైలుకు వెళ్లిన సురేశ్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఈ కేసులో తనకు బెయిల్ ఇప్పించాల్సిందిగా మాజీ ఎంపీ సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అయితే కేసులో తాము జోక్యం చేసుకోమని ట్రయిల్ కోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. దీంతో గుంటూరు జిల్లా నాలుగో అదనపు కోర్టులో బెయిల్ పిటిషన్ మళ్లీ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ విచారించిన కోర్టు మాజీ ఎంపీకి బెయిల్ ఇచ్చింది. రూ.10 వేల పూచీకత్తు సమర్పించాలని సూచించింది. మంగళవారం సాయంత్రం కోర్టు తీర్పు ఇవ్వడంతో మాజీ ఎంపీ బుధవారమే విడుదలయ్యే అవకాశం ఉంది. కోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.