మనమడిపై చంద్రబాబు ఒట్టేసి చెప్పగలరా? సురేశ్ సరికొత్త సవాల్
రాజధానిపై ఇష్టం వచ్చినట్లుగా విపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్. ఈ సందర్భంగా సంచలన సవాల్ ను సంధించారు.
By: Tupaki Desk | 18 Feb 2024 4:17 AM GMTరాజధానిపై ఇష్టం వచ్చినట్లుగా విపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్. ఈ సందర్భంగా సంచలన సవాల్ ను సంధించారు. రాజధాని అమరావతిపై ఆయన తన మనమడిపై ఒట్టేస్తారా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు వీరుడు.. శూరుడు అయితే పవన్ చంక ఎందుకు ఎక్కారు? అని నిలదీసిన ఆయన.. ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో ఏం మాట్లాడింది ప్రజలకు ఎందకు చెప్పలేకపోతున్నట్లు? అని ప్రశ్నించారు.
రాజధానిలో పచ్చటి పొలాల్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే అన్న ఆయన బలవంతంగా భూసేకరణ చేయలేదని మనమడి మీద ఒట్టేసి చెప్పాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబు గెలిచినట్లు చంకలు కొట్టుకుంటున్నారన్న సురేశ్.. "రాజధాని ఫైల్స్ పేరుతో సినిమా తీసి ఆత్మవంచన చేసుకున్నారు. రాజధానిని కుల రాజధానిగా మార్చారు. జగన్ ను చూసి చంద్రబాబు భయపడుతున్నారు. పంట పొలాల్ని ఎవరు కాల్చారో.. నార్కో టెస్టులతో తేల్చుకుందామా?" అని ప్రశ్నించారు.
కుప్పంలో దొంగ ఓట్లతో గెలిచే చంద్రబాబు పర్చూరు గురించి మాట్లాడటం సిగ్గుచేటుగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఉన్న చెత్త చంద్రబాబు.. పవన్.. ఎల్లో మీడియా అధిపతులే అంటూ నిప్పులు చెరిగిన ఎంపీ సురేశ్.. 'నాలుగు వందల రూపాయిల చొప్పున జనానికి ఇచ్చి సభకు తెచ్చుకునే దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఎస్సీలను దొంగల మాదిరి చిత్రీకరించాలని చంద్రబాబు చూస్తున్నారు. ఎస్సీలు.. బీసీలతో పెట్టుకునే 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడారు. ఒళ్లంతా రోగాలని చెప్పుకొని బెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తి చంద్రబాబు' అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
ప్రజలకు చంద్రబాబు భవిష్యత్తు ఇవ్వటమేంటి? రాజధానిపై చర్చకు 24 గంటల సమయం ఇస్తున్నాని.. దమ్ముంటే ఎవరైనా సరే చర్చకు రావాలంటూ సురేశ్ సవాలు విసిరారు. మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.