Begin typing your search above and press return to search.

యూట్యూబ్‌లో చూసి.. బాలిక‌పై అఘాయిత్యం.. నంద్యాల కేసులో న‌మ్మ‌లేని నిజాలెన్నో!

అయితే.. ఓ బాలుడి తండ్రికి ఈ విష‌యం తెలిసి కూడా... వారిని పోలీసుల‌కు అప్ప‌గించ‌కుండా.. బాలిక కుటుంబం ప‌ట్ల క‌నీసం సానుభూతి కూడా చూప‌కుండా.. అత్యంత దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించాడు.

By:  Tupaki Desk   |   17 July 2024 2:02 AM GMT
యూట్యూబ్‌లో చూసి.. బాలిక‌పై అఘాయిత్యం.. నంద్యాల కేసులో న‌మ్మ‌లేని నిజాలెన్నో!
X

నంద్యాల జిల్లా మ‌చ్చుమ‌ర్రిలో రెండు రోజుల కింద‌ట వెలుగు చూసిన‌.. ఎనిమిదేళ్ల బాలిక అత్యాచారం.. అనంత‌ర ఘ‌ట‌న‌ల్లో న‌మ్మ‌లేని నిజాలు.. వెలుగు చూశాయి. బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డిన వారు.. 12-14 ఏళ్ల మ‌ధ్యున్న బాలురే కావ‌డంతో అంద‌రూ ఉలిక్కిప‌డ్డారు. అంతేకాదు.. అత్యాచార య‌త్నం చేయ‌డంతో పాటు.. స‌ద‌రు బాలిక‌ను హ‌త్య కూడా చేశారు. అయితే.. ఓ బాలుడి తండ్రికి ఈ విష‌యం తెలిసి కూడా... వారిని పోలీసుల‌కు అప్ప‌గించ‌కుండా.. బాలిక కుటుంబం ప‌ట్ల క‌నీసం సానుభూతి కూడా చూప‌కుండా.. అత్యంత దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించాడు. స‌ద‌రు మృత‌దేహానికి రాయిక‌ట్టి కృష్ణాన‌దిలో ప‌డేయ‌డం.. వంటివి అనేక విష‌యాలు.. నంద్యాల కేసులో దిమ్మ‌తిరిగేలా చేస్తున్నాయి.

ఏం జ‌రిగింది?

రెండు రోజుల కింద‌ట నంద్యాల జిల్లాలోని ప‌గిడ్యాల మండ‌లంలో ఉన్న‌ ముచ్చుమర్రి గ్రామంలో ఎనిమిదేళ్ల‌ ఏళ్ల బాలికకు ముగ్గురు పిల్ల‌లు.. చాక్లెట్లు ఇచ్చి.. ఆడుకుందాం రమ్మంటూ.. బ‌య‌ట‌కు పిలిచారు. అనంత‌రం.. నిర్జ‌న ప్రాంతానికి తీసుక‌వెళ్లి.. ఆమె నోరు నొక్కి ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా అత్యాచారం చేశారు. అనంత‌రం ఈ దారుణాన్ని ఆమె ఎవరికైనా చెబుతుందని భావించిన బాలురు.. పీక నులిమి దారుణంగా హత్య చేశారు. బాలిక శ‌వాన్ని.. స‌మీపంలోని గ‌డ్డి వాములో దాచారు. అయితే.. బాలిక త‌ల్లిదండ్రులు.. త‌మ కుమార్తె క‌నిపించ‌డం లేద‌ని.. పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అనుమానంతో..

బాలిక‌ను కొందరు బాలురు తీసుకువెళ్లారంటూ.. స్థానికంగా ఉన్న ఓ చిన్నారి ఇచ్చిన‌ స‌మాచారంతో అనుమానించిన పోలీసులు.. నిందితులైన బాలురుని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి నిజాలు రాబ‌ట్టారు. కానీ, వారు చెప్పిన చోట ఎంత వెతికినా.. బాలిక మృత దేహం మాత్రం ల‌భ్యం కాలేదు. ఈలోగా.. ప్ర‌భుత్వం కూడా.. దీనిపై అలెర్ట్ అయింది. నేరుగా క‌లెక్ట‌ర్ రంగంలోకి దిగి ప‌రిస్థితిని స‌మీక్షించారు. ఈ క్ర‌మంలో బాలురిని మ‌రోసారి విచారించగా శవాన్ని నదిలో పడేశామని సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు. దీంతో కృష్ణాన‌దిలోనూ వెతికారు. అయినా.. అక్క‌డ కూడా ల‌భించ‌లేదు.

ఇక‌, మ‌రోవైపు.. ఓ బాలుడి తండ్రి.. ప‌దే ప‌దే స్టేష‌న్‌కు రావ‌డం.. త‌న పిల్లాడి గురించి వాక‌బు చేస్తుండ‌డంతో అనుమానం వ‌చ్చిన పోలీసులు అత‌నిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న‌ను విచారించ‌గా.. బాలిక మృతదేహాన్ని ఆ బాలుడి తండ్రి మరొకరి సాయంతో గడ్డిలో పెట్టి బైకు మీద తీసుకెళ్లి.. మృతదేహానికి రాయి కట్టి కృష్ణా నదిలో పడేసిన‌ట్టు తెలుసుకున్నారు. త‌మ బిడ్ద‌లు కేసుల్లో ఇరుక్కుంటారనే ఉద్దేశంతో ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టిన‌ట్టు స‌ద‌రు తండ్రి వెల్ల‌డించారు. దీంతో ఓ బాలుడి తండ్రి, పెదనాన్నలు ఇచ్చిన స‌మాచారం ఆధారంగా.. న‌దీ గ‌ర్భానికి వెళ్లి.. గ‌జ ఈత‌గాళ్ల‌తో వెతికించారు. అయినా.. బాలిక మృత దేహం మాత్రం ల‌భ్యం కాలేదు.

ముచ్చుమర్రి బాలిక కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, మృతదేహం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామ‌ని.. ఎస్పీ తెలిపారు. తొలుత మిస్సింగ్ కేసుగా న‌మోదైన ఎఫ్ ఐఆర్‌ను అత్యాచారం, హ‌త్య‌ కేసుగా మార్చిన‌ట్టు తెలిపారు. పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశామ‌న్నారు.

యూట్యూబ్ చూసి అత్యాచారం, హ‌త్య వంటి ఘాతుకాల‌కు ఒడిగ‌ట్టిన చిన్నారులు త‌మ ఇళ్ల‌లోని ఫోన్ల‌లో యూట్యూబ్ చూసి.. అత్యాచారం ఎలా చేయాలో నేర్చుకున్న‌ట్టు ఎస్పీ తెలిపారు. ఈ ఘ‌ట‌న స‌మీప ఆల‌యంలో చోటు చేసుకుంద‌న్నారు. పైగా త‌మ పిల్ల‌ల‌ను కాపాడేందుకు తండ్రే బాలిక శ‌వాన్ని రాయిక‌ట్టి మాయం చేసేందుకు ప్ర‌య‌త్నించార‌ని వివ‌రించారు.