పవన్ కు పేర్ని నాని కౌంటర్
అరకుతోపాటు మండపేట స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలోకి దిగుతారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన పవన్ కళ్యాణ్ ని హర్ట్ చేసినట్లుగా కనిపిస్తోంది.
By: Tupaki Desk | 26 Jan 2024 2:29 PM GMTటీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. అరకుతోపాటు మండపేట స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలోకి దిగుతారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన పవన్ కళ్యాణ్ ని హర్ట్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మాదిరిగా తనకు కూడా ఒత్తిళ్లు ఉంటాయని, అందుకే తాను కూడా రాజోలు, రాజానగరంలో జనసేన తరఫున బరిలోకి దిగబోయే అభ్యర్థులను ప్రకటిస్తున్నానని పవన్ చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే పవన్ కామెంట్లపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ అభ్యర్థుల ప్రకటన ఒక మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా అని నాని ఆరోపించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు రాజకీయ డ్రామాలతో ప్రజలు ఆల్రెడీ విసిగిపోయారని, వాళ్లను చూసి జనం నవ్వుకుంటున్నా సరే మరో కొత్త డ్రామా కు తెరతీశారని నాని సెటైర్లు వేశారు. 2019 ఎన్నికల తర్వాత ఇప్పటివరకు రాజోలు, రాజానగరం నియోజకవర్గాలకు టీడీపీ ఇన్చార్జిలు లేరని, అందుకే ఆ నియోజకవర్గాలను జనసేనకు చంద్రబాబు వదిలేశారని నాని ఆరోపించారు. వాటిని ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రకటించారని అన్నారు.
తనపై, తన పార్టీ నేతలపై వస్తున్న వ్యతిరేకతను చల్లార్చేందుకే పవన్ ఈ ప్రకటన చేశారని నాని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ అంటే కొందరు జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, వారిని బుజ్జగించేందుకే పవన్ ఈ డ్రామాకు తెరతీశారని అన్నారు. పవన్ కళ్యాణ్ కు పౌరుషం ఉంటే విశాఖ, తిరుపతి, కాకినాడ వంటి స్థానాలకు అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదని నాని ప్రశ్నించారు. దీన్నిబట్టి ఇదో మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా అని అర్థమవుతుందని అన్నారు. నాని కామెంట్లపై పవన్ కళ్యాణ్ లేదా జనసేన నేతల స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటించలేదంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది కూడా ఆసక్తి రేపుతోంది.