టికెట్ల పేరుతో కోట్లు వసూలు చేశాడు
విజయవాడ ఎంపీ నాని వర్సెస్ ఆయన సోదరుడు చిన్న మధ్య రాజకీయ వేడి మరింత రాజుకుంది. పెద్ద ఎత్తున విమర్శలు తెరమీదికి వస్తున్నాయి.
By: Tupaki Desk | 18 Feb 2024 8:34 AM GMTవిజయవాడ ఎంపీ నాని వర్సెస్ ఆయన సోదరుడు చిన్న మధ్య రాజకీయ వేడి మరింత రాజుకుంది. పెద్ద ఎత్తున విమర్శలు తెరమీదికి వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీలోనే ఉన్న ఎంపీ కేశినేని నాని.. ఇటీవల వైసీపీలో చేరిపోయారు. ఇక, దీనికి రెండేళ్ల ముందు నుంచి ఆయన సోదరుడు శివనాథ్ ఉరఫ్ చిన్ని.. విజయవాడ ఎంపీ స్థానంలోటీడీపీ తరపున కార్యక్రమాలు నిర్వహించారు. ఈయన పెద్ద ఎత్తున ఇక్కడ ఇన్వెస్ట్ చేశాడని అంటున్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఈయనకు టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉందని తెలుస్తోంది.
ఇదిలావుంటే.. సొంత సోదరుల మధ్య రాజకీయ దుమారం తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఇటీవల నాని కొంత సైలెంట్ అయినా.. చిన్ని మరింత గా రెచ్చిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో నానికి వైసీపీ టికెట్ ఇవ్వదని.. జగన్ ఆయన గొంతు కోయడం ఖాయమని అన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో నానిని నమ్మే వారు ఎవరూ లేరని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సొమ్ము లేక.. అప్పులు చేస్తున్నాడని.. వ్యాఖ్యానించారు. ఇప్పటికే అప్పులు చేసిన నాని వాటిని ఎగ్గొట్టే ప్లాన్‌లో ఉన్నాడని కూడా వ్యాఖ్యానించారు.
ఇక, ఇప్పుడు తాజాగా చిన్ని మరో బాంబు పేల్చాడు. టికెట్లు ఇప్పిస్తానని చెప్పి.. ఎంపీ నాని.. ఎంతో మందిని మోసం చేశాడని వ్యాఖ్యానించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, మైలవరం నియోజకవర్గాల్లో టికెట్లు ఇప్పిస్తానని.. ఆశావహ అభ్యర్థుల నుంచి ఆయన కోట్ల రూపాయలు వసూలు చేశారని వ్యాఖ్యానించారు. "నా స్నేహితుడి దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాడు. ఓ శుభకార్యం పేరు చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. కానీ, తిరిగి ఇవ్వలేదు. పైగా రోడ్డున పడేశాడు" అని నానీపై నిప్పులు చెరిగారు.
రెండు సార్లు ఎంపీగా గెలిచిన నాని.. టీడీపీకి ఏం మేలు చేశాడని చిన్ని ప్రశ్నించాడు. అంతేకాదు.. పార్టీలో ఉంటూ.. నాని వైసీపీకి కోవర్టుగా వ్యవహరించాడని.. ఈ విషయం చంద్రబాబు తెలుసుకోలేక పోయారని.. తెలుసుకుని ఉంటే.. అప్పుడే బయటకు గెంటేసి టికెట్ కూడా ఇచ్చేవారు కాదని తీవ్ర విమర్శలు గుప్పించారు. మరి దీనిపై నానిరియాక్షన్ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.