బాబుకు ఆమెకు ఇచ్చేది ఇరవై నిముషాలే !
ప్రతీ రోజూ ఎనిమిదిన్నరకు తనకు బాబు అపాయింట్మెంట్ ఇస్తారని ఆమె చెబుతూ ఆ తరువాత మళ్లీ రోజంతా ఆయన కనిపించరని తన పనిలో నిమగ్నం అవుతారు అన్నారు.
By: Tupaki Desk | 19 Dec 2024 5:34 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబుది దాదాపుగా అర్ధ శతాబ్దం పైగా ప్రజా జీవితం. ఆయన జీవితంలో తరచి చూస్తే ఈ రోజుకీ జనాలకు తెలియని ఎన్నో కోణాలు ఉంటాయి. బాబుని బయట అంతా ఒక విధంగా అనుకుంటారు కానీ ఆయనలో అనేక షేడ్స్ ఉంటాయి. చంద్రబాబుకు రాజకీయం శ్వాస అని అంతా అంటారు. అది నిజమే అని ఆయన పనితీరు చెబుతుంది.
ఆయన ప్రజలతో ఉంటే చాలు అదే పండుగ అనుకుంటారు. వారే కుటుంబం అని కూడా భావిస్తారు. వర్తమానంలో కానీ గతంలో కానీ బాబు లాంటి నేత ఎవరూ ఉండరు, ఇక ఫ్యూచర్ లో కూడా రారు అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంతటి నేతలకు అయినా సొంత జీవితం ఉంటుంది. వారు ఫ్యామిలీకి వీలైనంత టైం ని కేటాయిస్తారు.
కొందరు నేతలు అయితే అచ్చం ఆఫీసు టైం మాదిరి టెన్ టూ ఫైవ్ అన్నట్లుగా పనిచేస్తారు. వీకెండ్స్ లో ఎవరినీ కలవరు, ఇక పండగలూ పబ్బాలు అసలు వారితో ఎవరూ భేటీ అయ్యే చాన్స్ ఉండదు. మరి కొందరు నేతలు తీసుకుంటే రాత్రి తొమ్మిదితో ఆ డే కి ఎండ్ కార్డు వేస్తారు. ఎంతటి కీలకమైన పొజిషన్ లో ఉన్నా వారు అత్యవసరం అయితే తప్ప ఆ టైం దాటి ఇవ్వరు.
ఇలా తెలుగు నాట పనిచేసిన ముఖ్యమంత్రులు అంతా తలోవిధంగా ఉన్న వారే అని చెబుతారు. అయితే ఒకే ఒక్కడుగా చంద్రబాబు మాత్రం నిరంతరం ప్రజలు అంటూ తపిస్తారు. ఆ విషయంలో ఆయనను మెచ్చుకోవాల్సిందే. ఆయన ఇంట్లో ఎంతటి విషాదం జరిగినా కూడా ఆయన దానిని అదిమిపట్టి మరు క్షణం డ్యూటీలోకి వచ్చేస్తారు.
అంతే కాదు తన ఇంట్లో వేడుక జరిగినా కూడా ఆయన దాని కంటే ఏదో ప్రజా కార్యక్రమంలోనే గడుపుతారు. ఇలా సుదీర్ఘమైన బాబు జీవితంలో కుటుంబానికి ఇచ్చే సమయం ఎంత అంటే ఎవరు చెప్పగలరు అంటే కచ్చితంగా ఆయన జీవిత భాగస్వామి మాత్రమే. అందుకే నారా భువనేశ్వరి చంద్రబాబు గురించి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆమె కుప్పం టూర్ లో భాగంగా అక్కడ విద్యార్ధులతో మాట్లాడుతూ చంద్రబాబు తనకు రోజూ కేటాయించేది అచ్చంగా పదిహేను నుంచి ఇరవై నిముషాలు మాత్రమే అని చెప్పారు. ప్రతీ రోజూ ఎనిమిదిన్నరకు తనకు బాబు అపాయింట్మెంట్ ఇస్తారని ఆమె చెబుతూ ఆ తరువాత మళ్లీ రోజంతా ఆయన కనిపించరని తన పనిలో నిమగ్నం అవుతారు అన్నారు.
ఆయనకు పని అంటే అంత ఇష్టమని భువనేశ్వరి చెప్పారు. తాను కూడా చంద్రబాబు పనిని ఎపుడూ డిస్టర్బ్ చేయనని ఆమె అన్నారు. అత్యవసరం అయితే తాను బాబు పీఏకు ఫోను చేస్తాను తప్ప ఆయనకు చేయనని కొత్త విషయం చెప్పారు. ఇక ఫోన్ చేసినా బాబు తీయరని కూడా మరో విషయం చెప్పారు.
ఇక బాబు ఫుల్ బిజీగా తన వ్యాపకాలలో ఉండడంతో లోకేష్ ని తానే పెంచి పెద్ద చేశానని సింగిల్ విమెన్ గా తాను ఇవన్నీ సాధించానని ఆమె చెప్పారు. లోకేష్ ని చాలా స్ట్రిక్ట్ గా పెంచానని తనకు లోకేష్ హిట్లర్ అన్న పేరు కూడా పెట్టారంటే ఎంతలా క్రమశిక్షణ నేర్పానో అర్ధం చేసుకోవాలని ఆమె అన్నారు.
మొత్తం మీద చూస్తే బాబు తన మొత్తం ఏడున్నర దశాబ్దాల జీవితంలో ఇంటి కంటే ప్రజా జీవితానికే ఎక్కువ విలువ గౌరవం ఇచ్చారని అర్ధం అవుతోంది. అంతే కాదు బాబుకు రాజకీయాల పట్ల ఉన్న తపన మక్కువ కూడా అర్ధం అవుతున్నాయి. అందుకే బాబు ఎంచుకున్న రంగంలో ఎప్పటికప్పుడు విజేతగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారు. ఒక విధంగా చూస్తే నేటి యూత్ కి బాబు ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ అనే చెప్పాల్సి ఉంది.