Begin typing your search above and press return to search.

భువనేశ్వరి ఫుల్ టైమ్ పాలిటిక్స్! పురందేశ్వరికి మించిపోతారా?

ఏపీ ముఖ్యమంత్రి భార్య నారా భువనేశ్వరి ఫుల్ టైం పొలిటీషయన్ గా మారిపోతున్నారా? అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది.

By:  Tupaki Desk   |   8 March 2025 2:00 PM IST
భువనేశ్వరి ఫుల్ టైమ్ పాలిటిక్స్! పురందేశ్వరికి మించిపోతారా?
X

ఏపీ ముఖ్యమంత్రి భార్య నారా భువనేశ్వరి ఫుల్ టైం పొలిటీషయన్ గా మారిపోతున్నారా? అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. దాదాపు 40 ఏళ్లుగా చంద్రబాబు సహచరిగా ఉన్న ఆమె ఎప్పుడూ కూడా రాజకీయంగా క్రియాశీలంగా కనిపించలేదు. కానీ, గత కొన్నేళ్లుగా ఆమె ప్రధాన రాజకీయ స్రవంతిలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. రాజకీయాలు చేయకపోయినా రాజకీయ సంబంధిత కార్యక్రమాల్లో ఆమె ఎక్కువగా కనిపిస్తుండటంతో భువనేశ్వరి రాజకీయాల్లో ప్రవేశిస్తారా? అనే ప్రశ్న వినిపిస్తోంది. చంద్రబాబు క్రియాశీలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె రాజకీయ సభలు సమావేశాల్లో పాల్గొనే అవసరం లేకపోయినా, తన భర్తకు మద్దతుగా కుప్పం నియోజకవర్గంతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆమె రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తుండటం ఆసక్తి రేపుతోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య భువనేశ్వరి రాజకీయాలు కొత్తేమీ కాదు. దివంగత మహానేత ఎన్టీఆర్ తనయగా ఆమె చిన్నతనం నుంచి రాజకీయాలు దగ్గర నుంచి చూశారు. ఇక రాజకీయమే వృత్తి, ప్రవృత్తిగా చేసుకున్న చంద్రబాబుతో వివాహం అయిన దగ్గర నుంచి నిత్యం రాజకీయాలను చూస్తునే ఉన్నారు. అయినప్పటికీ ఆమె గత 40 ఏళ్లుగా రాజకీయాలతో అంటీముట్టనట్లుగానే వ్యవహరించారు. అయితే గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అరెస్టు తర్వాత భువనేశ్వరి వైఖరిలో మార్పు వచ్చిందని అంటున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని మార్చుకున్న భువనేశ్వరి నిత్యం ఏదో ఒక రాజకీయ కార్యక్రమంలో కనిపిస్తూనే ఉన్నారు. స్వచ్ఛంద సేవ పేరుతో ఆమె చేపడుతున్న కార్యక్రమాలు అన్నీ రాజకీయాలను ప్రభావితం చేసేవే కావడంతో రాజకీయాలవైపు భువనేశ్వరి అడుగులు వేస్తున్నారా? అనే సందేహాలు వస్తున్నాయి.

ఎన్టీఆర్ కుటుంబంలో చంద్రబాబుతోపాటు బాలక్రిష్ణ, పురందేశ్వరి వంటివారు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ఎన్టీఆర్ మరో అల్లుడు దగ్గుబాటి రాజకీయాల నుంచి వైదొలగారు. ఎన్టీఆర్ మరో కుమారుడు హరిక్రిష్ణ సైతం రాజకీయంగా ప్రభావం చూపారు. ఇక బాలక్రిష్ణ అల్లుళ్లు లోకేశ్, శ్రీభరత్ కూడా ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కుటుంబంలో ఇంతమంది రాజకీయంగా చురుగ్గా ఉన్నా, భువనేశ్వరి మాత్రం తన వ్యాపారం, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకే పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు ఆమె స్టైల్ మారినట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం బాధ్యతలు అన్నీ భువనేశ్వరి పర్యవేక్షిస్తున్నారు. కుప్పం వాసులకు తాను అందుబాటులో ఉంటానని చెబుతూ చంద్రబాబుకు ఆసరగా రాజకీయాలు నడుపుతున్నారు. ఆమె కృషి వల్లే గత ఎన్నికల్లో చంద్రబాబు రికార్డు మెజార్టీతో గెలిచారంటున్నారు.

ఇక విజయవాడలో తలసేమియా రోగుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడంతోపాటు అమరావతిలో ఎన్టీఆర్ ట్రస్టు భవనం నిర్మించాలనుకోవడం, తమ అమ్మమ్మ ఊరు కొమరవొలును దత్తత తీసుకుని ప్రత్యేక అభివృద్ధి పనులు చేపట్టడం వల్ల భువనేశ్వరి రాజధాని అమరావతి ప్రాంతంపై ప్రత్యేక ఫోకస్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా తన సేవా కార్యక్రమాలతో పార్టీకి పరోక్ష సహకారం అందించేలా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయంలో తన సోదరి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో పోటీపడేలా భువనేశ్వరి పనిచేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. పురందేశ్వరిలా రాజకీయాల్లో స్వశక్తిగా ఎదగాలని కోరుకోకున్నా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా భువనేశ్వరి వ్యవహరిస్తుండటం ఆసక్తికరంగా మారుతోంది. భర్త, కుమారుడు ఇద్దరూ రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్నప్పటికీ భువనేశ్వరి మాత్రం సేవ కార్యక్రమాల ద్వారా రాజకీయాలకు అతీతమైన ఇమేజ్ సంపాదిస్తూ.. పరోక్షంగా రాజకీయాలపై ప్రభావం చూపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.