బ్రాహ్మణిపై భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు!
తన కోడలు నారా బ్రాహ్మణిపై ఆమె అత్త, ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 1 Oct 2024 7:23 AM GMTతన కోడలు నారా బ్రాహ్మణిపై ఆమె అత్త, ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణి రాజకీయ ప్రవేశంపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
బ్రాహ్మణికి రాజకీయాలు అంటే ఏమాత్రం ఇష్టం లేదని.. ఆమెకు వ్యాపారం అంటే ఇష్టమని భువనేశ్వరి తెలిపారు. వ్యాపారం ద్వారా స్వయంకృషితో ఎదగడం బ్రాహ్మణికి ఇష్టమని వెల్లడించారు. ప్రస్తుతం హెరిటేజ్ గ్రూప్ లో బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారన్నారు.
ఈ నేపథ్యంలో బ్రాహ్మణి ఎప్పటికీ రాజకీయాల్లోకి రాబోరని భువనేశ్వరి హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయాలంటే తన కోడలుకు అస్సలు పడదని అసలు విషయం చెప్పేశారు. తనకు వ్యాపారం చేసుకోవడం, స్వతహాగా ఎదగడమే ఇష్టమన్నారు. హెరిటేజ్ అభివృద్ధిలో బ్రాహ్మణి కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు.
కాగా గతేడాది సెప్టెంబర్ లో చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేయించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బ్రాహ్మణి చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. నిత్యం వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. తన అత్త భువనేశ్వరితో కలిసి రాజమండ్రిలోనే ఉంటూ చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ టీడీపీ చేపట్టిన వివిధ కార్యక్రమాలను బ్రాహ్మణి ముందుండి నడిపించారు.
ఈ క్రమంలో బ్రాహ్మణి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని భారీగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి, సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ మనవరాలిగా, మరో ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ కుమార్తెగా బ్రాహ్మణికి ప్రజల్లో క్రేజు ఉంటుందని టీడీపీ భావించిందని చర్చ జరిగింది.
బ్రాహ్మణి ఉన్నత విద్యావంతురాలు. ప్రపంచంలోనే టాప్ విద్యా సంస్థల్లో ఒకటైన హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. తెలుగు, ఇంగ్లిష్ ల్లో అనర్ఘళంగా మాట్లాడగలరు. ఇప్పటికే ఆమె తమ కుటుంబం ఆధ్వర్యంలోని హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. తన తెలివితేటలతో హెరిటేజ్ గ్రూప్ ను లాభాల బాట పట్టించారని గుర్తు చేస్తున్నారు.
గతేడాది తన మామ చంద్రబాబును అరెస్టు చేయడం, మరోవైపు తన భర్త లోకేశ్ ను కూడా అరెస్టు చేసే వాతావరణం కనిపించడంతో బ్రాహ్మణి తాత్కాలికంగా టీడీపీ పగ్గాలు చేపడతారని టాక్ నడిచింది. ఆమెకు తోడుగా తండ్రి నందమూరి బాలకృష్ణతోపాటు దివంగత ఎన్టీఆర్ కుటుంబం మొత్తం తోడుగా ఉంటుందని చర్చ జరిగింది.
ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన భర్త లోకేశ్ తరఫున బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను పర్యటించారు. మహిళలు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు, చిరుద్యోగులు, ఐటీ ఎంప్లాయిస్ తో, గేటెడ్ కమ్యూనిటీ ప్రజలతో వరుస ముఖాముఖిలు నిర్వహించారు. లోకేశ్ 90 వేలకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించడంలో బ్రాహ్మణి క్రియాశీలక పాత్ర పోషించారు.