లోకేష్ విన్నపం ఫలిస్తే.. బాబు వెనక్కే.. !
మంత్రి నారా లోకేష్.. తండ్రిని మించిన తనయుడు అయ్యేందుకు వడివడిగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 5 Feb 2025 4:30 PM GMTమంత్రి నారా లోకేష్.. తండ్రిని మించిన తనయుడు అయ్యేందుకు వడివడిగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పెట్టుబడులపై ఎక్కువగా దృష్టి పెట్టారు. పార్టీ కూటమిగా ఏర్పడి ప్ర భుత్వం స్థాపించినప్పటి నుంచి నారా లోకేష్ లెక్కకు మిక్కిలిగా పెట్టుబడి దారులతో చర్చలు జరిపారు. ప్రభుత్వం అలా ఏర్పడగానే.. నారా లోకేష్ ఇలా.. పెట్టుబడి దారులకు ఆహ్వానాలు పలికారు. ఆ వెంటనే ఆయన చర్చలు చేపట్టారు. ఇదే విషయం దావోస్ పర్యటన తర్వాత చెప్పుకొచ్చారు కూడా.
దావోస్ పర్యటన కంటే కూడా.. ముందే తాము పెట్టుబడి దారులతో చర్చలు జరిపామని.. దావోస్‌లో కేవలం ఏపీ బ్రాండ్ వినిపించేందుకు మాత్రమే పరిమితం అయ్యామని నారా లోకేష్ తెలిపారు. దీనిని బట్టి.. నారా లోకేష్ తన తండ్రి, సీఎం చంద్రబాబును ఓవర్ టేక్ చేసి మరీ పెట్టుబడులు ఆహ్వానించే విషయం లో దూకుడుగా ఉన్నట్టు స్పష్టమైంది. ఇక, తాజాగా ఈ విషయంలో మరో కీలక విన్నపం చేశారు. దేశంలో స్థాపించబోయే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏపీకి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.
ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి మరీ విన్నవించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్‌లో ఏఐ ఎక్సలెన్స్ గురించి ప్రస్తావించింది. వచ్చే ఏడాదిలో ఈ కేంద్రాన్ని దేశంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. అయితే.. ఇతమిత్థంగా ఫలానా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని చెప్పలేదు. దీంతో ఏపీ వంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో ఏఐని ఏర్పాటు చేయాలని, తమ ప్రభుత్వం ఐటీకి ఎనలేని ప్రాధాన్యం ఇస్తోందని నారా లోకేష్ విన్నవించారు.
అంతేకాదు.. ఇతర రాష్ట్రాలు ఈ విషయంలో ఇంకా ఆలోచనలోనే ఉంటే.. నారా లోకేష్ ముందుగానే కర్చీఫ్ వేసేశారు. కేంద్రమంత్రికి ఏపీలో ఉన్న ఐటీ వ్యవహారాలను తాము ఇస్తున్న ప్రాధాన్యాన్ని కూడా వివరించారు. దీనిపై సానుకూల సంకేతాలు వచ్చాయని ఎంపీలు చెబుతున్నారు. కానీ, ఇది కేంద్రంతో ముడిపడిన వ్యవహారం కావడంతో మరింత గట్టిగ ప్రయత్నాలు చేయాలి. ఇదే కనుక నారా లోకేష్ సాధిస్తే.. దేశం మొత్తం ఏపీవైపు చూడడం ఖాయం. ఒక్క దేశమే కాదు.. విదేశాలు కూడా... ఏపీవైపు చూస్తాయి. ఏఐ సెంటర్ కోసం.. ఏకంగా వెయ్యి కోట్లకు పైగానే.. కేంద్రం ఖర్చుచేస్తోంది.