కొండంత ఆశలు.. గంపెడు పెట్టుబడులు: ముగిసిన నారా లోకేష్ అమెరికా టూర్!!
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. అమెరికా పర్యటన ముగిసింది.
By: Tupaki Desk | 1 Nov 2024 10:11 AM GMTటీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. అమెరికా పర్యటన ముగిసింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఆస్టిన్ వరకు.. పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనేక మంది పెట్టుబడిదారులతోనూ భేటీ అయ్యారు. ఈ పర్యటన ముగించుకున్న ఆయన.. ఏపీకి బయలు దేరారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా పర్యటన పెట్టుకున్న నారా లోకేష్ గత నెల 22న అమెరికాకు వెళ్లారు. వెళ్తూ వెళ్తూనే ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలోని పెట్టుబడి దారులతో భేటీ అయ్యారు.
సుదీర్ఘ ప్రసంగాలు.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇచ్చారు. ఏపీలో ఉన్న వనరులు.. `6 పాలసీ లు`.. `విజన్ 2047` పెట్టుబడులకు అనుకూల వాతావరణం.. వంటి విషయాలను కూలంకషంగా వారికి వివరించారు. వచ్చే 2047 నాటికి ఏపీని దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ముందుండేలా తీర్చిదిద్దుతున్న ట్టు చెప్పారు. ``మాకు రాష్ట్రాలతో కాదు.. దేశాలతోనే పోటీ`` అని సగర్వంగా ప్రకటించుకున్నారు. అనం తరం.. ఆస్టిన్‌లో ఎలాన్ మస్క్ సంస్థ ప్రతినిధులతోనూ నారా లోకేష్ భేటీ అయ్యారు.
ఈవీ వాహనాల బ్యాటరీ తయారీకి అనంతపురం సరైన వేదికగా ఉంటుందని వారికి చెప్పారు. అనంతపురంలో పెట్టుబడులు పెడితే.. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహకరిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న కియా పరిశ్రమను దీనికి ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఇక, టెక్ దిగ్గజం సత్య నాదెళ్లతోనూ.. నారా లోకేష్ నేరుగా భేటీ అయ్యారు. విశాఖలో పెట్టుబడులు పెట్టాలని విన్నవించారు. అదేవిధంగా మరో పారిశ్రామిక వేత్త ఇంద్రా నూయిని కూడా కలుసుకున్నారు.
అనంతరం.. పలు సంస్థల ప్రతినిధులు మరియు సీఈవోలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించిన మంత్రి లోకేష్ ప్రస్తుతం విజన్ ఉన్న ప్రభుత్వం ఉందని, సీఎం చంద్ర బాబు దూరదృష్టి, పునరుత్పాదక ఇంధన వనరులతోపాటు.. మేలైన యువ శక్తి కూడా ఏపీకి వరంగా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. వారి నుంచి బలమైన హామీలతో ఏపీకి తిరిగి ప్రయాణమయ్యారు.