ఇండియా వర్సెస్ పాక్... దుబాయ్ స్టేడియంలో లోకేష్ సందడి!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యంత ఆసక్తికరమైన, రసవత్తరమైన, హైఓల్టేజ్ మ్యాచ్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 Feb 2025 2:14 PM GMTఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యంత ఆసక్తికరమైన, రసవత్తరమైన, హైఓల్టేజ్ మ్యాచ్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికైన సంగతి తెలిసిందే. క్రికెట్ ప్రపంచం అంతా దృష్టిసారించే ఆ ఆసక్తికర పోరు భారత్ – పాకిస్థాన్ మ్యాచ్. ఈ సమయంలో దుబాయ్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సందడి చేశారు.
అవును... ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా అత్యంత రసవత్తర మ్యాచ్ కు దుబాయ్ వేదికైంది. ఇప్పటికే న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలై.. చావో రేవో పరిస్థితుల్లో పాకిస్థాన్.. భారత్ తో తలబడుతుండగా.. బంగ్లాపై సునాయాసంగా గెలిచిన ఆత్మవిశ్వాసంతో టీమిండియా బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ లో ఓడితే ఆతిథ్య పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే!
ఆ సంగతి అలా ఉంటే... ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలని దేశవ్యాప్తంగా అభిమానులు పూజలు నిర్వహిస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. మరోపక్క దుబాయ్ స్టేడియం మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఫుల్ అటిండెన్స్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ ఈ స్టేడియంలో సందడి చేశారు.
ఈ సందర్భంగా... ఎంపీ కేశినేని చిన్ని, సినీ దర్శకుడు సుకుమార్ లతో కలిసి కనిపించారు. మరోపక్క కుమారుడు దేవాంశ్ తో కలిసి భారతదేశ జాతీయ జెండా ప్రదర్శిస్తూ టీమిండియాను ప్రోత్సహించారు. ఇదే సమయంలో.. ఐసీసీ చీఫ్ జైషా తోనూ కలిసి ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.