వీసీ నియామకాలపై వైసీపీ ఆరోపణలు.. దుమ్ములేపిన లోకేశ్
మండలి సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష సభ్యులు ఎక్కువగా ఉన్న సభలో అధికార పక్షాన్ని టార్గెట్ చేయడానికి వైసీపీ విఫలయత్నం చేస్తోంది.
By: Tupaki Desk | 25 Feb 2025 10:47 AM GMTశాసనమండలిలో వైసీపీపై మంత్రి నారా లోకేశ్ ఎదురుదాడి చేశారు. వీసీ నియామకాల్లో దేశంలో ఎక్కడా లేనట్లు ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. 9 మంది వీసీలను బెదిరించి రాజీనామా చేయించారని చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అధికారపక్షం మండిపడింది. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రసంగానికి అడ్డుతగిలిన మంత్రి లోకేశ్.. ఉత్తినే ఆరోపణలు చేయడం కాదని, దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. ఆయనకు మద్దతుగా టీడీపీ ఎమ్మెల్సీలు కూడా గొంతుకలపడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.
మండలి సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష సభ్యులు ఎక్కువగా ఉన్న సభలో అధికార పక్షాన్ని టార్గెట్ చేయడానికి వైసీపీ విఫలయత్నం చేస్తోంది. ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలకు అధికార పక్షం దీటుగా సమాధానం చెబుతోంది. ప్రధానంగా మంత్రి నారా లోకేశ్ ప్రభుత్వం తరఫున వైసీపీ ఎమ్మెల్సీలను దీటుగా ఎదుర్కోవడం ఆసక్తికరంగా మారింది. రెండో రోజు మండలి సమావేశాల్లో పలు అంశాలపై వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ప్రతి ఆరోపణను తిప్పికొట్టిన మంత్రి లోకేశ్.. వైసీపీ గత పాలనలో చోటుచేసుకున్న అంశాలను గుర్తుచేసి వారిని ఇరుకన పెట్టే ప్రయత్నం చేశారు.
గవర్నర్ ప్రసంగంలో విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించినట్లు ప్రకటించారని, వైస్ చాన్సలర్ల నియామకం ప్రభుత్వ బాధ్యత అని చెప్పిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 17 మంది వైస్ చాన్సలర్లతో రాజీనామా చేయించిందని ఆరోపించారు. అయితే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలకు మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. వీసీలను ఎవరు బెదిరించారో నిరూపించాలని సవాల్ విసిరారు. వైసీపీ పాలనలోనే ఏపీపీఎస్సీ చైర్మన్ గదికి తాళం వేశారని గుర్తు చేశారు. సత్యదూరం మాటలు ఆడుతున్నారని, నేను చాలెంజ్ చేస్తున్నానని, ఎవరు బెదిరించారో నిరూపించాలని మంత్రి లోకేశ్ డిమాండ్ చేశారు. దీంతో సభలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.