జగన్ ఒక సద్దాం హుస్సేన్...పోలిక సరిపోయిందా ?
జగన్ కి ఎన్ని పేర్లో. మరెన్ని పోలికలో. ఆయనకు ఇలాంటి పోలికలు పెడుతూ కొత్త పేర్లు పెడుతున్న వారు ఆయనకు ఆప్తులు కారు, ప్రత్యర్ధులే
By: Tupaki Desk | 20 March 2025 10:26 PM ISTజగన్ కి ఎన్ని పేర్లో. మరెన్ని పోలికలో. ఆయనకు ఇలాంటి పోలికలు పెడుతూ కొత్త పేర్లు పెడుతున్న వారు ఆయనకు ఆప్తులు కారు, ప్రత్యర్ధులే. చంద్రబాబు అయితే డ్రగ్స్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్ తో పోల్చారు. ఇపుడు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ అయితే ఏకంగా సద్ద్దాం హుస్సేన్ తో పోలిక పెడుతూ జగన్ మీద హాట్ కామెంట్స్ చేశారు. ఇదంతా దేనికి అంటే విశాఖపట్నంలోని రుషికొండ కొండపై ఉన్న చిన్న పర్యాటక శాఖ విల్లాలను సైతం జగన్ తన విలాసం కోసం ఏకంగా ఎక్కడా లేని విధంగా సకల సౌకర్యవంతమైన రాజభవనంగా మార్చారని ఆయా ఆరోపిస్తూ చేసిన కామెంట్స్ ఇవి.
ఈ నేపధ్యంలోనే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సద్దాం హుస్సేన్ మధ్య ఉన్న పోలికలు ఏమిటి అన్నవి నారా లోకేష్ తనదైన శైలిలో చూపించారు. జగన్ గురించి ఆయన చెబుతూ ఏకంగా మూడు దశాబ్దాల పాటు తానే ఏపీలో అధికారంలో ఉంటారని భావించి విశాఖలో ఆ రాజభవనాన్ని నిర్మించారని లోకేష్ విమర్శించారు.
విశాఖలో ఈ భవనం నిర్మాణం ద్వారా అక్కడకు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరమైన బీచ్ దృశ్యాన్ని సైతం చూడడానికి లేకుండా చేశారని నిందించారు. అలా జగన్ తనను తాను ఆంధ్రాకు చెందిన సద్దాం హుస్సేన్ అని భావించి పెద్ద రాజభవనాన్ని నిర్మించారని అన్నారు.
ఇక రుషికొండ వద్ద జగన్ ఏకంగా మూడు గొప్ప నిర్మాణాలను నిర్మించారని సెటైర్లు వేశారు. వాటిలో ఒకటి తన కోసం రెండు తన కుమార్తెల కోసం నిర్మించారని ఇక తన భార్య కోసం ఒక ప్రత్యేక క్యాంప్ ఆఫీస్ నే ఏర్పాటు చేశారని లోకేష్ కామెంట్స్ చేశారు.
లోకేష్ సద్దాం హుస్సేన్ తో పోలిక పెట్టడానికి కారణం మాజీ ఇరాకీ నియంత సద్దాం హుస్సేన్ కూడా అందమైన రాజభవనాలను నిర్మించడానికి విలాసవంతమైన జీవనశైలిని ఆస్వాదించడానికి ప్రసిద్ధి చెందాడని చెబుతారు. అంతే కాదు ఆయనకు భారీ నిర్మాణాలలో పెద్ద హాళ్లు పెద్ద గదులు, ఖరీదైన ఇటాలియన్ పాలరాయి విలాసవంతమైన ఫిట్టింగులతో కూడిన భవనాలు నిర్మాణాలు ఉన్నాయని చెబుతారు. అయితే ఇవన్నీ ప్రజా నిధులతో నిర్మించబడ్డాయని లోకేష్ చెబుతూ అందుకే సద్దాం హుస్సేన్ తో పోలిక జగన్ కి తెచ్చాను అన్నారు.
ఇక జగన్ విషయంలో మరో మాట కూడా ఆయన చెప్పారు జగన్ ఎప్పుడూ భయంతో జీవించే వ్యక్తిగా అభివర్ణించారు. ఆయన తన చుట్టూ ఎపుడూ వేయి మంది భద్రతా సిబ్బంది ఉండేలా చూసుకోవడం కోసమే ఈ భారీ విలాసవంతమైన రాజ మందిరాన్ని లోకేష్ ఆరోపించారు.
ఇక ఇంతటి విలాసవంతమైన రుష్కొండ ప్యాలెస్ కోసం రాష్ట్ర పర్యాటక శాఖ ఏకంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, అయితే అక్కడ అందమైన కొండలని నాశనం చేశారన్న కారణంతో , పర్యావరణం, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 200 కోట్ల రూపాయల జరిమానా విధించిందని చెప్పారు. ఇలా చూస్తే కనుక జరిమానా తో కలుపుకుని రుషికొండ ప్యాలెస్ మొత్తం ఖర్చు 700 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన జగన్ చేసిన ఆ రుషికొండ నిర్వాకాన్ని సభలో గట్టిగానే చాటారు.
ఇక జగన్ కి కేవలం నలుగురు మాత్రమే కుటుంబ సభ్యులు ఐ అందులో తల్లికి సోదరికి చోటు లేదని ఆయన ఎద్దేవా చేశారు. మరి ఈ నలుగురికీ ఇంతటి పెద్ద ప్యాలెస్ అవసరమా అని అన్నారు. దేశాన్ని ఏలే ప్రధాని నరేంద్ర మోడీకి కూడా నివసించడానికి అంత గొప్ప ప్యాలెస్ లేదని లోకేష్ అంటూ జగన్ అంటే అదే మరి అని కామెంట్స్ చేశారు.
మొత్తానికి చూస్తే జగన్ ని సద్దాం హుస్సేన్ తో లోకేష్ పోల్చుతూ చేసిన ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆనాడు చంద్రబాబు జగన్ ని డ్రగ్స్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్ తో పోలిచినపుడూ ఇదే స్థాయిలో వైరల్ అయింది. మరి జగన్ ఇంకెంతమంది అంతర్జాతీయ నేతల పోలికలతో ముందుకు వస్తారో చూడాలని అంటున్నారు.