కేసీఆర్ కన్నా ముందు లోకేశ్.. తెలంగాణపై స్పెషల్ స్కెచ్
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉనికి కోల్పోయిన టీడీపీ.. తాజాగా పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది.
By: Tupaki Desk | 10 Feb 2025 7:30 AM GMTతెలంగాణలో టీడీపీని విస్తరించాలనే ఆలోచన ఆ పార్టీలో ఎక్కువవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉనికి కోల్పోయిన టీడీపీ.. తాజాగా పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత అధినేత చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు. అయితే ఏపీ పాలన వ్యవహారాల్లో బిజీ అయిపోయిన చంద్రబాబు.. ఎన్నికలు జరిగి 8 నెలలు అవుతున్నా తెలంగాణపై ఫోకస్ చేయలేకపోతున్నారు. దీంతో ఆ పనిని తన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కు అప్పగించినట్లు చెబుతున్నారు.
తెలంగాణలో కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందేలా చంద్రబాబు తనయుడు లోకేశ్ పకడ్బందీ వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఆయన ఒకప్పటి సహచరుడు, షో టైమ్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు రాబిన్ శర్మ సహాయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవలే ప్రశాంత్ కిశోర్ తో భేటీ అయిన లోకేశ్.. తెలంగాణలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే విషయమే ఎక్కువ చర్చించినట్లు చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ కోసం పనిచేసిన ప్రశాంత్ కిశోర్ కు తెలంగాణ రాజకీయాలపై అవగాహన ఉంది. దీంతో ఆయన సూచనలు అక్కరకు వస్తాయని లోకేశ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా గత ఎన్నికల్లో ఏపీలో కూటమి విజయానికి ప్రణాళికలు రచించిన రాబిన్ శర్మ సేవలను తెలంగాణలో వాడుకోవాలని భావిస్తున్నారట.
ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ ఎదిగేందుకు తగిన వాతావరణం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలను తిరిగి తెప్పించి బలోపేతం చేయాలని చూస్తున్నారని సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ట్రయాంగల్ ఫైట్ నడుస్తోంది. అయితే బీఆర్ఎస్ ప్రస్తుతానికి బలంగా కనిపిస్తున్నా, ఆ పార్టీ అధినేత కేసీఆర్ జనం మధ్యకు రావడం లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్ రావులే అంతా తామై వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ చురుగ్గా పావులు కదుపుతోంది. అయితే టీడీపీ తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ సానుభూతిపరులు ఉన్నారని, కార్యకర్తలు చెక్కు చెదరలేదని ఆ పార్టీ అంచనా వేస్తోంది. నాయకత్వం లేకపోవడమే మైనస్గా భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అయ్యేలోగా ఆ పార్టీ నుంచి పాత టీడీపీ నేతలను రప్పించి తెలంగాణ పుంజుకోవచ్చని చూస్తోంది. దీనిపై మంత్రి లోకేశ్ రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు.
వాస్తవానికి తెలంగాణలో టీడీపీ బలోపేతంపై చాలా కాలం నుంచి వర్క్ చేస్తున్నారు. ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ నుంచి పలువురు సీనియర్లను తీసుకోవాలని చూశారని చెబుతున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతోపాటు ఇంకొందరు బీఆర్ఎస్ నేతలు టీడీపీ అధిష్ఠానంతో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. అదేవిధంగా బీజేపీతో మిత్రుత్వం కూడా తెలంగాణలో టీడీపీ బలపడేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారట. మైనార్టీల్లో టీడీపీకి మంచి బలం ఉంది. ఆ వర్గాన్ని ఆకట్టుకోవడంలో బీజేపీకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దీంతో ఆ వర్గం ఓట్ల కోసం బీజేపీ కూడా తెలంగాణలో టీడీపీ పుంజుకోవాలని ఆశిస్తోందని అంటున్నారు. ఉబయ కుశోలపరిగా రెండు పార్టీల మధ్య ఓ అవగాహనతో బీఆర్ఎస్ ను వీక్ చేసి ఆ ప్లేస్ లోకి టీడీపీని తీసుకురావాలని చూస్తున్నట్లు చర్చలు సాగుతున్నాయి. మరి లోకేశ్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో.. అంతవరకు బీఆర్ఎస్ రానిస్తుందో లేదో చూడాల్సివుంది.