లోకేష్ విషయంలో అదే సరైన ముహూర్తమా ?
తెలుగుదేశంలో ఈ రోజు ఏ నిర్ణయం అయినా లోకేష్ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని అంతా అనుకోవడం అంటే అది లోకేష్ కి పార్టీ మీద ఉన్న పూర్తి స్థాయి పట్టు అని అంటున్నారు.
By: Tupaki Desk | 27 Dec 2024 7:30 AM GMTనారా లోకేష్ ఒక నాడు పప్పు. ఇపుడు రెడ్ బుక్. ఆయన పేరుతో పాటుగా రెడ్ బుక్ పేరునే విపక్షంలోని వైసీపీ ఎక్కువగా స్మరిస్తోంది అంటే గ్యారంటీగా లోకేష్ బాబు సూపర్ సక్సెస్ ట్రాక్ లో ఉన్నట్లే. 2014 నాటికి తెర చాటున ఉన్న నాయకుడు. 2017లో చూస్తే ఎమ్మెల్సీగా అయి మంత్రి అయిన వారు. 2019లో తొలిసారి ఓటమి చవిచూసి వైసీపీ చేతిలో బాగా ట్రోల్ కాబడిన వారు. అయితే 2024లో మాత్రం లోకేష్ ఏపీ పాలిటిక్స్ లో ఒక బ్రాండ్ గా నిలిచారు.
లేకపోతే రెడ్ బుక్ అంటూ ఒక దానిని ప్రవేశపెట్టి విపక్షం షాక్ అయ్యేలా చేయడం అంటే మాటలు కాదు. అది చంద్రబాబు హయాంలోనూ ఆలోచనకు కూడా రాలేదు. విపక్షాన్ని ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ టీడీపీని కూడా మెల్లగా తన కంట్రోల్ లోకి చినబాబు తెచ్చుకున్నారని ప్రచారం అయితే ఉంది.
ఈ రోజున పార్టీలో లోకేష్ బాబు ప్రభావం బలంగా ఉంది. అందుకే ఎక్కువగా యూత్ లీడర్లు కనిపిస్తున్నారు అని అంటున్నారు. మంత్రివర్గంలోనూ ఆయన ముద్ర ఉందని అంటారు. ఆ మధ్యన అమెరికా పర్యటనకు వెళ్లి తిరిగి వచ్చిన లోకేష్ ని మొత్తం తెలుగుదేశం మంత్రులు ఆయన నివాసంలో కలసి అభినందించడం ఒక సంకేతంగా చూడాలి.
తెలుగుదేశంలో ఈ రోజు ఏ నిర్ణయం అయినా లోకేష్ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని అంతా అనుకోవడం అంటే అది లోకేష్ కి పార్టీ మీద ఉన్న పూర్తి స్థాయి పట్టు అని అంటున్నారు. చంద్రబాబు సైతం నాలుగవసారి ఏపీకి సీఎం గా ఉన్నారు అంటే భవిష్యత్తు ఆలోచనలతోనే అని అంటారు.
ఆయన వారసుడిగా లోకేష్ టీడీపీని నడపగలరా అన్న సందేహాలు 2024 కి ముందు ఉండేవి. కానీ ఇపుడు అవి పటాపంచలు అవుతున్న నేపథ్యం ఉంది. ఇక ప్రభుత్వంలో చంద్రబాబు సీఎం గా బాధ్యతలు చూసుకుంటున్నారు. ఆయనకు అక్కడ కూడా అవసరం అయితే చేదోడు వాదోడుగా లోకేష్ సహకారం ఉంటుందని అంటారు. ఆ విషయాలను పక్కన పెడితే లోకేష్ రాజకీయంగా రాటు తేలారు అని అంతా అనే మాట.
ఆయన ఏపీలో చాలా స్పీడ్ గా టాప్ ర్యాంక్ లీడర్లలో ఎమర్జ్ అవుతున్న వారుగా విశ్లేషణలు ఉన్నాయి. లోకేష్ ని కాబోయే సీఎం గా కూడా చెప్పడానికి రాజకీయ పండితులు కూడా ఇపుడు ఏ మాత్రం సంకోచించడం లేదు. ఆయన కీలక శాఖలకు మంత్రిగా తనదైన శైలిలో పాలన చేస్తున్నారు. అంతే కాదు ఆయన రాజకీయంగా వ్యూహ రచనలోనూ రాణిస్తున్నారు అని చెబుతారు.
ఇవన్నీ పక్కన పెడితే లోకేష్ ని సరైన ముహూర్తంలో ముందుకు తీసుకుని రావాలన్నది ఒక ఆలోచనగా పార్టీలో ఉందని అంటున్నారు. ఈ టెర్మ్ కి ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారు. అందులో నో డౌట్. కానీ వచ్చే ఎన్నికల నాటికి లోకేష్ బాబుని ముందు పెట్టి చంద్రబాబు తనదైన రాజకీయ చాతుర్యంతో టీడీపీ బండిని జనం ముందుకు తీసుకుని వెళ్తారు అని అంటున్నారు. లోకేష్ కి పార్టీ జనం మద్దతు ఉంది. బయట జనం మద్దతు కూడా దక్కుతుందన్న విశ్వాసం అయితే పార్టీలో ఉంది. దానికి కరెక్ట్ ముహూర్తం ఎపుడూ అంటే అది ఒక్క చంద్రబాబుకే తెలుసు. ఆ రోజు కోసమే టీడీపీలో యంగ్ వింగ్ అంతా ఎదురుచూస్తున్నారు.