Begin typing your search above and press return to search.

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా లోకేష్ కు తెలుసు

ఇప్పుడు టీడీపీలో ఎంత కాదనుకున్న అన్న నందమూరి తారకరామరావు స్థాపించిన పార్టీలో ఆయన మనవడు జూ.ఎన్టీఆర్ పేరును అభిమానుల్లో ఎవరూ చెరపలేరు.

By:  Tupaki Desk   |   20 March 2025 9:30 AM IST
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా లోకేష్ కు తెలుసు
X

రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం.. శాశ్వత మిత్రుత్వం ఉండదంటారు.. అది ఫాలో అయ్యే నాయకులే పైకి ఎదుగుతారు.. ఎన్నికల ముందర పాత పగలన్నీ పక్కనపెట్టి ఒక్కటైన చంద్రబాబు - పవన్ కళ్యాణ్ లు అధికారం సాధించారు. 2019కి ముందర తిట్టుకున్న ఈ నేతలు కలిసిపోయి ఇప్పుడు అధికారం అనుభవిస్తున్నారు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. జనాభీష్టం మేరకు నడుచుకోవాలి. ఇప్పుడు టీడీపీలో ఎంత కాదనుకున్న అన్న నందమూరి తారకరామరావు స్థాపించిన పార్టీలో ఆయన మనవడు జూ.ఎన్టీఆర్ పేరును అభిమానుల్లో ఎవరూ చెరపలేరు. చెరపడం సాధ్యం కాదు కూడా.. టీడీపీ కార్యకర్తలు, నేతల నోట జూ.ఎన్టీఆర్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. అలా అని దాన్ని అవైడ్ చేస్తే నెగెటివ్ అయిపోతాం.. అందుకే రాజకీయాల్లో ఎంతో పరిణతి కనబరిచాడు నారా లోకేష్. ఈ టీడీపీ భావి వారసుడు తనకు పోటీగా అందరూ చిత్రీకరిస్తున్నా కానీ జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీని అభిమానుల కోరిక మేరకు పట్టుకొని ఫిదా చేశాడు. రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవారే నిజమైన నాయకుడు అంటారు. ఈ విషయాన్ని నారా లోకేష్ ముందుగానే గ్రహించినట్టు ఈ ఘటన రుజువు చేస్తోంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆహ్వానించడంలో చురుగ్గా ఉంటున్నారు. ఈ క్రమంలో భాగంగానే నేడు నూజివీడులో అశోక్ లేలాండ్ ప్లాంట్‌ను లోకేష్ ప్రారంభించారు. అయితే ఈ ప్రారంభోత్సవానికి లోకేష్ వస్తున్న సమయంలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో అభిమానులు లోకేష్‌ను స్వాగతించడానికి చేరుకున్నారు.

గుమిగూడిన జనంలో కొందరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని పట్టుకుని నిలబడ్డారు. ఉత్సాహంగా ఉన్న కొందరు అభిమానులు ఆ ఫ్లెక్సీని పట్టుకోవాలని లోకేష్‌ను కోరగా, ఆయన సంతోషంగా అంగీకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనతో నందమూరి, టీడీపీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

గత కొంతకాలంగా ఎన్టీఆర్ - లోకేష్ మధ్య విభేదాలు ఉన్నాయని రాజకీయ ప్రత్యర్థులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, లోకేష్ ఎల్లప్పుడూ వాటిని ఖండిస్తూ వస్తున్నారు. యువగళం పాదయాత్రలో ఉన్న సమయంలో ఎన్టీఆర్‌ను టీడీపీలోకి ఆహ్వానించే అవకాశం గురించి విలేకరులు ప్రశ్నించగా లోకేష్ స్పందిస్తూ "టీడీపీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్న ఎవరైనా పార్టీలోకి రావడానికి స్వాగతం. అదేవిధంగా ఎన్టీఆర్ కూడా వచ్చి మా పార్టీలో భాగం కావచ్చు" అని స్పష్టం చేశారు.

సాధారణంగా రాజకీయ నాయకులు వివాదాస్పద విషయాలపై మాట్లాడటానికి లేదా అలాంటి చర్యలు చేయడానికి వెనుకాడుతారు. కానీ లోకేష్ మాత్రం ఎటువంటి సంకోచం లేకుండా అభిమానుల అభ్యర్థన మేరకు ఎన్టీఆర్ ఫ్లెక్సీని పట్టుకోవడం విశేషం. రాజకీయాల్లో ఎంత అణుకువ, ఓర్పు, నేర్పు ఉంటేనే సక్సెస్ అవుతారని నానుడి ఉంది. ఈ చర్యతో నారా లోకేష్ దాన్ని చేసి చూపించారని టీడీపీ మేధావులు కూడా అభినందిస్తున్నారు.

ఆ తర్వాత లోకేష్ అశోక్ లేలాండ్ ప్లాంట్‌ను ప్రారంభించి, ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఆటోమొబైల్ కంపెనీని అభినందించారు.