బాబు సింహం..మరి జగన్...?
తన తండ్రి టీడీపీ అధినేతగా ప్రతిపక్షంలో ఉన్నపుడు 151 మందితో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని డేరింగ్ గా ఫేస్ చేశారని మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో కీలక వ్యాఖ్యలు చేసారు.
By: Tupaki Desk | 15 Nov 2024 3:50 AM GMTతన తండ్రి టీడీపీ అధినేతగా ప్రతిపక్షంలో ఉన్నపుడు 151 మందితో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని డేరింగ్ గా ఫేస్ చేశారని మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో కీలక వ్యాఖ్యలు చేసారు. సింహం సింగిల్ అని చెప్పుకునే వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదంటూ ఆయన వైసీపీని సూటిగా ప్రశ్నించారు
సభలో అతి తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా చంద్రబాబు ఏ రోజూ సభకు గైర్ హాజరు కాలేదని ఆయన గుర్తు చేశారు. అయితే తన తల్లిని సభలో అవమానం చేసిన తరువాతనే బాబు సభకు నమస్కారం పెట్టారని ఆయన గుర్తు చేశారు.
ఆనాడు సభలో వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు తమ కుటుంబం మీద ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేస్తే సభలోనే ఉన్న జగన్ ఏమి చేశారని ప్రశ్నించారు. పైగా వారికే ఎన్నికల్లో టికెట్లు కూడా ఇచ్చింది నిజం కాదా అని ఆయన నిలదీశారు. తన తల్లిని నిండు శాసన సభలో అవమానించారని లోకేష్ అన్నారు. చంద్రబాబు ఎపుడూ అసెంబ్లీకి రాకుండా పోలేదని ఆయన చెప్పారు. జగన్ తప్పించి మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు అయినా అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని లోకేష్ నిలదీశారు.
ఒక దశలో లోకేష్ తీవ్ర ఆవేశానికి లోను అయ్యారు. తన తల్లిని అవమానిస్తే సభలో మాట్లాడవద్దా అని ఆయన ప్రశ్నించారు. ఆనాడు సభలో ఏమి జరిగిందో గౌరవ సభ కాస్తా కౌరవ సభగా ఎందుకు మారిందో అన్నీ ప్రజల ముందే ఉన్నాయని అన్నారు.
వీడియో రికార్డులు సైతం ఉన్నాయని అన్నారు. ఇదిలా ఉంటే శాసనమండలిలో వైసీపీ తరఫున ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ పాత విషయాలను తవ్వి తీసుకుంటే బోలెడు ఉంటాయని ప్రజా సమస్యలు చర్చించాలని కోరారు.
మరో వైపు చూస్తే కేవలం లోకేష్ మాతృ మూర్తినే కాకుండా జగన్ తల్లి చెల్లెలు మరో చెల్లెలు సునీతను కూడా వైసీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు కించపరచారని అన్నారు. వీరి విషయంలో సైతం చర్యలు తీసుకోలేదని అనాటి ప్రభుత్వం తీరు అలా ఉందని అధికార కూటమి నుంచి ఎమ్మెల్సీలు సభలో ప్రస్తావించారు.
ఇవన్నీ ఇలా ఉంటే లోకేష్ ఫస్ట్ టైం తనలోని యాంగ్రీ నెస్ ని చూపించారు. సభలో ఆయన ఆగ్రహంతో విశ్వరూపం ప్రదర్శించేసరికి సభ ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోయింది. అయితే లోకేష్ ఆ వెంటనే తమాయించుకోవడం కూడా జరిగింది. ఇక ఆయన మరో సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి అని అంటూ ఆ వెంటనే గారూ అని కూడా చేర్చి మాట్లాడడం ద్వారా తన హుందా తనాన్ని చాటుకున్నారని అంటున్నారు. మొత్తం మీద లోకేష్ తన తండ్రి చంద్రబాబు సింహమని చెబుతూ జగన్ గురించి వైసీపీ నేతలకే నిలదీసిన ఘటన మాత్రం వైరల్ అయింది.