నాలుగు లక్షలు వర్సెస్ మూడు వేలు: సోషల్ మీడియాలో పంచ్‌లు
మంత్రి నారా లోకేష్ .. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న పేరుంది. ఆయన ఏ విషయాన్నయినా.. ఎలాంటి మొహమాటం లేకుండా ప్రజలతో పంచుకుంటారు.
By: Tupaki Desk | 26 March 2025 7:50 AMమంత్రి నారా లోకేష్ .. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న పేరుంది. ఆయన ఏ విషయాన్నయినా.. ఎలాంటి మొహమాటం లేకుండా ప్రజలతో పంచుకుంటారు. ఫొటోలు, వీడియోలు, కామెంట్లు ఇలా.. అన్ని విషయాలను ప్రజలకు చేరువ చేస్తారు. ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. అయితే.. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా వేదికగా.. నారా లోకేష్‌కు కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఆయనను ప్రశ్నిస్తూ.. గత రెండు మూడు రోజులుగా కొందరు పోస్టులు పెడుతున్నారు.
``4 లక్షలు ఏమయ్యాయి సర్!`` అంటూ మెజారిటీ ప్రజల నుంచి పోస్టులు ఎదురవుతున్నాయి. కొందరు.. `ఇంకెప్పుడు 4 లాక్స్` అని అంటున్నారు. దీనికి కారణం.. ఎన్నికలకు ముందు ఇచ్చిన కీలక హామీ. ఏటా 4 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని.. వాటిని భర్తీ చేస్తామని నారా లోకేష్ చెప్పడమే. కానీ, ఇప్పటికి పది మాసాల్లోకి ప్రభుత్వం వచ్చినా.. ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఒక్క పోస్టు కూడా ఇవ్వలేదు. ఇది ఒకరకంగా సర్కారుకు కూడా ఇబ్బందిగానే ఉంది.
మరోవైపు మెగా డీఎస్సీ ద్వారా.. భర్తీ చేయాలని అనుకున్నా 6 వేల పోస్టులు మాత్రమే ఉన్నాయి. దీనికి కూడా ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇక, ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ అవుతున్న ఉద్యోగాలు కూడా.. పదుల సంఖ్యలోనే ఉన్నాయి. అంటే.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఏటా నాలుగు లక్షల చొప్పున ఉపాధి, ఉద్యోగాలు ఇచ్చేందుకు.. ప్రభుత్వానికి ఇంకా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు.. మొత్తం ఐదేళ్లు పూర్తయ్యే సరికి 20 లక్షల ఉద్యోగాలు, లేదా ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది.
ఇవన్నీ ఒక ఎత్తయితే.. మరో సమస్య కూడా.. సర్కారును మంత్రి నారా లోకేష్‌ను వెంటాడుతోంది. అదే.. నిరుద్యోగ భృతి. ఉద్యోగం లేదా ఉపాధి వచ్చే వరకు.. రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలకు రూ.3000 చొప్పున ఇస్తామని చంద్రబాబు, నారా లోకేష్ సహా పవన్ కల్యాణ్ హామీలు ఇచ్చారు.కానీ, ఇప్పటి వరకు అసలు నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారన్న లెక్కే తీయలేదు. పైగా తాజాగా ప్రకటించిన 2025-26 వార్షిక బడ్జెట్‌లో దీని ప్రస్తావనే చేయలేదు. దీంతో నిరుద్యోగులు.. అటు 4 లక్షలతోపాటు.. ఇటు 3వేల రూపాయల వ్యవహారాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తుండడం ఒకింత ఇబ్బందేనని చెప్పాలి.