Begin typing your search above and press return to search.

కార్యకర్త ప్రాణమంటూ లోకేష్ భావోద్వేగ లేఖ

తెలుగుదేశం పార్టీ ఎపుడూ ఒక మాట చెబుతూ ఉంటుంది. కార్యకర్తలే ప్రాణమని. వారే పార్టీకి జీవగర్రని.

By:  Tupaki Desk   |   17 Jan 2025 5:57 AM GMT
కార్యకర్త ప్రాణమంటూ లోకేష్ భావోద్వేగ లేఖ
X

తెలుగుదేశం పార్టీ ఎపుడూ ఒక మాట చెబుతూ ఉంటుంది. కార్యకర్తలే ప్రాణమని. వారే పార్టీకి జీవగర్రని. వారు లేకపోతే పార్టీయే లేదని. అలనాడు అన్న నందమూరి అంటే అశేష విశేష అభిమానం కనబరచి తెలుగుదేశం పార్టీకి రధ చక్రాలుగా మారిన ఎందోరో అభిమానులు తరువాత కాలంలో కరడు కట్టిన పార్టీ కార్యకర్తలు అయ్యారు.


వారిని అలా పార్టీకి పునాదులుగా తరగని ఆస్తిగా మార్చడంతో టీడీపీ అధినాయకుడు చంద్రబాబు పాత్ర నిరుపమానమైంది. ఆయన చేసిన కృషి కూడా వెలకట్టలేనిది. గత పదేళ్లుగా టీడీపీలో క్రియాశీలకంగా ఉంటూ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేష్ నాయకత్వంలో పర్యవేక్షణలో టీడీపీ కొత్త పుంతలు తొక్కింది.

కార్యకర్తల సంక్షేమం కోసం లోకేష్ తీసుకుంటున్న చర్యలు మరో మెట్టున పార్టీ కార్యకర్తను నిలబెట్టాయి. కార్యకర్త లేకపోతే పార్టీ లేదు అని అంటారు. అదే నిజమని చెబుతూ కార్యకర్తనే అధినేతగా చేసి వారిని ఎంతో సమాదరిస్తూ నారా లోకేష్ తీసుకుంటున్న అనేక చర్యల ఫలితమే తెలుగుదేశం పార్టీ ఏకంగా కోటి సభ్యత్వాలను దాని దేశంలో తనకు పోటీ సరిసాటి మరో పార్టీ లేదని నిరూపించుకోవడం.

ఇది నిజంగా రికార్డు. దీనిని సాధించడంలో లోకేష్ పాత్ర చాలా కీలకం. ఆయన ఎంతో ప్రోత్సాహం ఉత్సాహం ఇస్తూ కార్యకర్తలను పార్టీని వెన్నుదన్నుగా మారుస్తూ మరో వందేళ్ల పాటు టీడీపీ సలక్షణంగా ఉండేందుకు బలమైన పునాదులు వేస్తున్నారు ఇదిలా ఉండగా కోటి సభ్యత్వాల మార్క్ దాటిన సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి నారా లోకేష్ రాసిన భావోద్వేగ పూరితమైన లేఖ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ప్రాణసమానమైన కార్యకర్తలకు అభినందనలతో అంటూ లోకేష్ చేసిన సంభోదన క్యాడర్ కి కొత్త ఊపిరి పోసేలా ఉంది.

ఇక ఈ లేఖలో అన్న గారి ప్రస్తావన చేశారు లోకేష్. ఆనాడు నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది అని ఆయన చెప్పిన మాట నిజమే. అలా కేవలం ఎన్టీఆర్ అన్న ఒకే ఒక్కరితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ప్రయాణం ఈ రోజు కోటి మందితో అతి పెద్ద కుటుంబంగా మారిందని లోకేష్ గుర్తు చేశారు.

తెలుగుదేశం సభ్యత్వం అంటే వారు టీడీపీ కుటుంబమే అని ఆయన ఇచ్చిన చేయూత కూడా బహు గొప్పది అని చెప్పాల్సి ఉంది. పార్టీ సభ్యత్వాన్ని ఒక యాగంగా చేశారని అందుకోసం ఊరూరా జై టీడీపీ అంటూ ఒక పండుగనే చేశారని క్యాడర్ ని లోకేష్ ప్రశంసించారు.

కేవలం ఏపీ తెలంగాణాలలో మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యారని లోకేష్ గుర్తు చేసుకున్నారు. అందుకే టీడీపీ సభ్యత్వ నమోదులో గత రికార్డులు బద్ధలయ్యాని కోటి సభ్యత్వాలతో సరికొత్త చరిత్ర సృష్టించామని ఆయన గర్వంగా చాటారు. టీడీపీ బలం, బలగం అంతా కార్యకర్తలే అని లోకేష్ మరోమారు వారిని కొనియాడారు.

ఇక వైసీపీ హయమాలో పీక మీద కత్తి పెట్టి బెదిరించినా టీడీపీ తప్ప మరో పేరు నోట రాదని చెప్పి తన ప్రాణాన్ని విడిచిన చంద్రయ్య అనే కార్యకర్తను నారా లోకేష్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అంతే కాదు ప్రత్యర్ధులను ఎదురొడ్డి జై చంద్రబాబు అన్న అంజిరెడ్డి తాత తెగువ తనకు నిత్యస్ఫూర్తి అని గొప్పగా చెప్పారు.

అదే విధంగా సార్వత్రిక ఎన్నికల్లో బూత్ ఏజెంట్ గా ఉండటానికి వీలు లేదని ప్రత్యర్థి మూకలు గొడ్డలి వేటు వేసినా రక్తపు గాయాలతోనే పోలింగ్ బూత్లో కూర్చొని రిగ్గింగ్ అడ్డుకున్న ఉక్కు మహిళ మంజుల ధైర్యం గురించి సైతం ఆయన గుర్తు చేసుకున్నారు. ఇవన్నీ ఉదాహరణలు అని ఆయన పేర్కొంటూ ప్రతీ గ్రామంలో ప్రాణం కంటే పార్టీనే ఎక్కువ అని చాటి చెబుతూ పసుపు జెండాను మోస్తున్న్ క్యాడర్ కి ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేనిదని ఆయన భావోద్వేగమయ్యారు.

దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం టిడిపికి మాత్రమే సొంతమని లోకేష్ స్పష్టం చేశారు. అందుకే మరే పార్టీ ఇవ్వని గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. పార్టీలో ఏ కీలక నిర్ణయం చంద్రబాబు తీసుకోవాలీ అన్నా కార్యకర్తలతోనే చర్చిస్తారు అని దటీజ్ తెలుగుదేశం పార్టీ అని లోకేష్ లేఖలో పేర్కొన్నారు.

పార్టీకి దిశా నిర్దేశం చేసెది క్యాడరే అని ఆయన మరో మారు ప్రకటించారు. అటువంటి కార్యకర్తలకు ఉపాధి, వైద్యంతో పాటు వారి పిల్లల చదువు కోసం కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా తనకు ఎంతో పవిత్రమైన బాధ్యతను అప్పగించారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 2500 మందికి పైగా కార్యకర్తల పిల్లల చదువులకు సహాయం అందించామని, అలాగే, వివిధ ప్రమాదాల్లో మరణించిన సుమారు 5164 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల రూపాయలు చొప్పున రూ. 103 కోట్ల 28 లక్షల రూపాయలు అందజేసామని ఆయన వివరించారు.

అంతే కాకుండా అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది కార్యకర్తలకు వైద్య సహాయం అందించామని, సుమారు 2000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని, సుమారు 5000 మంది కార్యకర్తల కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలిచి రూ. 19 కోట్లు ఆర్థిక సహాయం చేసామని లోకేష్ వెల్లడించారు.

ఇక ఎన్టీఆర్ మోడల్ స్కూళ్ల ద్వారా ఉచిత విద్య, ఉపకారవేతనాలకు, ప్రైవేట్ స్కూళ్లలోనూ ఫీజుల్లో రాయితీలు రూ. 2 కోట్ల 35 లక్షల రూపాయలు చెల్లించామని అన్నారు. చదువు పూర్తయిన వారికి ఉపాధి ఉద్యోగావకాశాలు సాధించేలా నైపుణ్యశిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం సభ్యత్వం ద్వారా వచ్చే ప్రమాద బీమా ప్రయోజనాన్ని రూ. 5 లక్షలకు పెంచామని లోకేష్ కీలకమైన ప్రకటన చేసారు.

పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్తకు అండగా నిలవడమే తన ఎజెండాగా ఈ లేఖలో లోకేష్ గట్టిగా మరోసారి చాటారు. ఇక కొన్ని నియోజకవర్గాల నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్షకు పైగా సభ్యత్వాలు చెయ్యడంతో పాటు లైఫ్ టైమ్ సభ్యత్వాలు కూడా ఎక్కువగా చేశారని పేర్కొంటూ వారికి ప్రత్యేక అభినందనలు తెలియచేశారు.

ఇక టీడీపీ కోటి సభ్యత్వాలతో రికార్డులు బద్దలు కొట్టడంలో భాగస్వామి అయిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలంటూ లోకేష్ ముగించిన ఈ లేఖ ఎంతో స్పూర్తిగా ఉంది. పార్టీ క్యాడర్ కి ఎంతో ఉత్సాహంగా ప్రోత్సాహంగా ఉంది. అంతే కాదు మిగిలిన పార్టీలకు కూడా ఇది ఒక స్పూర్తిదాయకమైన విషయంగానూ ఉంది అనడంలో అతిశయోక్తి లేదు.