చిన్న లాజిక్.. పెద్ద బెనిఫిట్.. దటీజ్ లోకేష్..!
నారా లోకేష్ అంటే.. ఒకప్పుడు ఎలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఆయన హవా.. ఆలోచనలు వేరేగా ఉన్నాయి.
By: Tupaki Desk | 7 April 2025 10:03 AMనారా లోకేష్ అంటే.. ఒకప్పుడు ఎలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఆయన హవా.. ఆలోచనలు వేరేగా ఉన్నాయి. ఒకవైపు.. తన నియోజకవర్గంలో పునాదులు బలోపేతం చేసుకోవడంతోపాటు.. మరోవైపు.. రాష్ట్రంపై నా పట్టు సాధించేలా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో చిన్న చిన్న అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఆయన వేస్తున్న అడుగులు సక్సెస్ అయ్యాయి. ఎమ్మెల్యేగా గత ఏడాది తొలిసారి విజయం దక్కించుకు న్న నారా లోకేష్.. వెంటనే కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అదే.. ప్రజాదర్బార్. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని ఒకటి రెండు నెలలకు మాత్రమే పరిమితం చేయాలని నారాలోకేష్ అనుకున్నారు. కానీ, ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన స్పందన చూశాక.. నిరంతరా యంగా కొనసాగిస్తున్నారు. నిజానికి ఈ కార్యక్రమం ద్వారా.. ప్రభుత్వం పెట్టే ఖర్చుకానీ.. వేదికల నిర్మాణం కానీ.. బహిరంగ సభలు కానీ ఉండవు. ప్రజల నుంచి సమస్యలు తీసుకోవడమే. కానీ.. ఈ కార్యక్రమం ద్వారా.. సభలు సమావేశాలు.. పెట్టిన దానికంటే కూడా.. ఎక్కువగా ప్రభుత్వానికి పేరు వచ్చింది.
దీనిని గమనించిన ప్రభుత్వం రెండో నెల నుంచి అధికారికంగానే ప్రజాదర్బార్‌ను చేపట్టింది. ప్రతి రోజూ.. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఈ చిన్న లాజిక్.. ద్వారా నారా లోకేష్ మంచి మార్కులు వేసుకున్నారు. ఇక, ఇప్పడు మరో చిన్న లాజిక్ ద్వారా.. ఆయన మరింత పేరు తెచ్చుకుంటున్నారు. అదే.. ``మన ఇల్లు-మన లోకేష్`` కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఇటీవలే ఆయన చేపట్టారు.
ఇది కూడా సర్కారు చేతికి మట్టి అంటే పనే లేని కార్యక్రమం. మహా అయితే.. ఒక వంద రూపాయల ఖర్చు అంతే. కానీ, ఇది నారా లోకేష్ పేరును.. ఓటు బ్యాంకును అమాంతం పెంచేసింది. ఇక ఈ కార్యక్రమం ద్వారా.. ఇళ్లు లేని పేదలు.. ప్రభుత్వం భూములను, స్థలాలను ఆక్రమించుకుని వేసిన ఇళ్లను క్రమబద్ధీకరించనున్నారు. వారు ఉంటున్న భూములను వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తారు. దీనిని వారి నుంచి పైసా తీసుకోరు. ప్రభుత్వం కూడా.. ఏమీ ఖర్చు పెట్టదు. కానీ.. ఇది పేదల్లో భారీ భరోసా నింపుతోంది. ప్రస్తుతం కేవలం మంగళగిరికే పరిమితమైన దీనిని రాష్ట్ర వ్యాప్తంగా వేరేపేరుతో విస్తరించే పనిలో ఉన్నారు.