ఇంట్రెస్టింగ్ మీట్ : లోకేష్ విత్ పీకే
ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించి వివిధ రంగాలలో చేస్తున్న సాయానికి ధన్యవాదాలు తెలిపారు.
By: Tupaki Desk | 5 Feb 2025 3:23 AM GMTఢిల్లీ పర్యటనకు వెళ్ళిన మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించి వివిధ రంగాలలో చేస్తున్న సాయానికి ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ఏపీకి మరిన్ని రంగాలలో నిధులు అవసరం ఉన్నందున ఆ దిశగా ఆయన కేంద్ర మంత్రులను కోరారు.
ఇదిలా ఉంటే ఈ పర్యటనలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. నారా లోకేష్ ఢిల్లీలోని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార నివాసంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో భేటీ కావడం ఒక రాజకీయ విశేషంగా చూస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ లోకేష్ ల మధ్య భేటీ రెండు గంటల పాటు సాగిందని చెబుతున్నారు.
ఈ సందర్భంగా ఇద్దరూ ఏపీ రాజకీయాల గురించి చర్చించుకున్నారు అంటున్నారు. ఏపీలో ఎనిమిది నెలల కూటమి పాలన గురించి లోకేష్ ఆయనకు తెలియచేశారని ఇదే సందర్భంగా కూటమి సంకీర్ణం పాలన జనసేన బీజేపీల పాత్ర గురించి కూడా చర్చ సాగింది అని అంటున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడం పైనా చర్చ సాగింది అని అంటున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం రానున్న రోజులల్లో మరింతగా జనంలోకి వెళ్ళేలా తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్ లోకేష్ కి పలు సూచనలు చేసినట్లుగా చెబుతున్నారు. ఏపీలో టీడీపీ తన అధికారాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలన్నా వైసీపీ పుంజుకోకుండా ఉండాలన్నా చేయాల్సిన చర్యల గురించి కూడా ప్రశాంత్ కిశోర్ తన వ్యూహాలుగా చెప్పారని అంటున్నారు. తనకు ఉన్న కొన్ని ఐడియాలను కూడా లోకేష్ తో ప్రశాంత్ కిశోర్ పంచుకున్నారని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా టీడీపీకి గత ఎన్నికల ముందు వ్యూహకర్తగా కాకుండా ముఖ్య సలహదారుడిగా పీకే వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆయన తరచుగా అమరావతికి వచ్చి చంద్రబాబు లోకేష్ లతో భేటీ అయ్యారు. అంతే కాదు 2024 ఎన్నికల్లో వైసీపీ దారుణంగా పరాజయం పొందుంతుందని చారిత్రాత్మకమైన విజయాన్ని టీడీపీ దక్కించుకుంటుందని కూడా పీకే ఎవరూ చెప్పని జోస్యాన్ని చెప్పారు.
అదే నిజం అయింది కూడా దాంతో టీడీపీతో పీకే సంబంధాలు అలా కొనసాగుతున్నాయి. లోకేష్ ని ఢిల్లీలో ప్రత్యేకంగా పీకే భేటీ అయి ముచ్చటించారు అంటే ఇంకా దీని వెనక ఏదో వ్యూహం ఉందని కూడా ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఈ భేటీ వెనక ఏముందో ఏమిటో అన్నది.