Begin typing your search above and press return to search.

విశాఖ మీద లోకేష్ ఫోకస్ పెట్టేసినట్లేనా ?

విశాఖ జిల్లాలో టీడీపీకి పూర్తి బలం ఉంది. ఆ పార్టీకి కంచుకోట విశాఖ జిల్లా. తాజా ఎన్నికల్లో మొత్తానికి మొత్తం సీట్లను కూటమి గెలుచుకుంది.

By:  Tupaki Desk   |   1 Sep 2024 4:28 AM GMT
విశాఖ మీద లోకేష్ ఫోకస్ పెట్టేసినట్లేనా ?
X

విశాఖ జిల్లాలో టీడీపీకి పూర్తి బలం ఉంది. ఆ పార్టీకి కంచుకోట విశాఖ జిల్లా. తాజా ఎన్నికల్లో మొత్తానికి మొత్తం సీట్లను కూటమి గెలుచుకుంది. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్లు గెలిచారు. పదవులు ఆశించారు. కానీ ఒకే ఒక మంత్రి పదవిని ఇచ్చారు. అది కూడా పాయకరావుపేట కు చెందిన వంగలపూడి అనితకు ఇచ్చారు.

ఆమె వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు అయిదేళ్ల పాటు సమర్ధవంతంగా విపక్ష పాత్ర పోషించారు. దాంతో ఆమె విధెయత సమర్ధత సేవలను గురించి కీలకమైన హోం శాఖను ఇచ్చారు ఇక ఎన్నికల ముందు వచ్చి హడావుడి చేసిన వారికి టికెట్లు కూడా కొంత ఊరించి ఇచ్చారు కానీ మంత్రి పదవులు ఇవ్వలేదు.

దాంతో మొత్తం ఉమ్మడి జిల్లాల బాధ్యత అనిత మీద పడింది. ఆమె అతి పెద్ద జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైన విశాఖ జిల్లాను మంత్రిగా లీడ్ చేయాల్సి వస్తోంది. దాంతో పాటు మంత్రి పదవులు ఆశించిన సీనియర్లు అవి దక్కకపోవడంతో కొంత సైలెంట్ అయ్యారు. గతంలోలా చురుకుగా వ్యవహరించడం లేదు.

ఈ నేపధ్యంలో విశాఖ పర్యటన పెట్టుకున్న నారా లోకేష్ మూడు రోజుల పాటు అక్కడే ఉన్నారు. పార్టీ గురించి వాకబు చేశారు. నాయకులతో సమీక్షలు జరిపారు. అందరినీ పిలిచి మాట్లాడారు. విశాఖ జిల్లాలో టీడీపీ మరింత పటిష్టంగా ఉండాలని సూచించారు. వైసీపీని జనాలు నమ్మడంలేదన్నది టీడీపీ అధినాయకత్వం భావన. తెలుగుదేశానికి మొదటి నుంచి ఓటు వేస్తూ అందలం ఎక్కిస్తున్న విశాఖలో పార్టీ నేతలు కూడా అంతే స్పీడ్ గా ఉంటూ పనిచేయాలని సూచించారని అంటున్నారు.

పదవుల విషయంలో కూడా అనేక మంది లోకేష్ ని కలిశారు. నామినేటెడ్ పదవులు ఇవ్వమని కోరారు. అయితే లోకేష్ అందరికీ ఒక్కటే చెప్పారు. పార్టీ ఎవరికీ అన్యాయం చేయదు, ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో చూసి మరీ చేస్తుందని అన్నారు. వచ్చిన వారిని నిరాశపరచకుండా లోకేష్ వారిని సమాధానపరచారు. అదే టైం లో విశాఖ జిల్లాలోని సమస్యలను కూడా ఆయన టచ్ చేశారు.

మీడియా ముందు ఆయన వాటికి సమాధానాలూ చెప్పారు. గత మూడు దశాబ్దాలుగా ఉన్న సింహాచలం పంచగ్రామాల సమస్యను పరిష్కరించి స్థానికులకు న్యాయం చేస్తామని చెప్పారు. అలాగే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాకుండా ఏమి చేయాలలో అన్నీ చేస్తామని చెప్పారు. విశాఖను ఐటీ పరంగా మేటిగా నిలుపుతామని ఇండస్ట్రియల్ హబ్ గా మారుస్తామని చెప్పారు.

రానున్న కాలంలో విశాఖ దేశంలోనే నంబర్ వన్ సిటీగా అయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. మొత్తం మీద లోకెష్ విశాఖ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారని అంటున్నారు. రానున్న రోజులలో ఆయన మరిన్ని పర్యటనలు చేయడం ద్వారా విశాఖలో పార్టీని పాలనను ఏకతాటి మీదకు తేవడం అభివృద్ధి పనులను పట్టా లెక్కించడం చేస్తారని అంటున్నారు.