జగన్ కు లోకేష్ మొబైల్ ఫోన్... రూ.10 కోట్ల ఛాలెంజ్!
ఈ తరహా ప్రచారం వైసీపీ నేతలు చేస్తున్నారని చెబుతూ.. వారిపై నిప్పులు కక్కిన లోకేష్ రూ.10 కోట్ల ఛాలెంజ్ విసిరారు.
By: Tupaki Desk | 19 March 2025 12:01 PM ISTఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... జనవరి 30 నుంచి 155 సేవలతో వాట్సప్ గవర్నెన్స్ అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ సేవల సంఖ్య 200 గా ఉండగా.. మార్చి నెలాఖరుకు ఆ సంఖ్య 300.. జూన్ నెలాఖరుకల్లా 500 సేవలు అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
ప్రధానంగా... ఏ సేవనైనా పౌరులు అడిగిన 10 సెకన్లలో అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో జనవరి 30 నుంచి వివిధ శాఖల పరిధిలో సుమరు 1.23 కోట్ల లావాదేవీలు జరగ్గా.. అందులో వాట్సప్ ద్వారా జరిగినవి 51 లక్షలని మంత్రి లోకేష్ తాజాగా వెల్లడించారు. అయితే... ఈ సర్వీసులపై హ్యాకింగ్ ప్రచారం మొదలైంది.
ఇందులో భాగంగా... ఆధార్ నంబర్ తో సహా పర్సనల్, ప్రైవేట్ డేటా ఈ పోర్టల్ ద్వారా చట్టవిరుద్ధంగా షేర్ చేయబడుతోందని ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకూ సేఫ్ అనే విషయంపై చర్చ జరుగుతోందని అంటున్నారు. దీంతో... ఈ తరహా ప్రచారం వైసీపీ నేతలు చేస్తున్నారని చెబుతూ.. వారిపై నిప్పులు కక్కిన లోకేష్ రూ.10 కోట్ల ఛాలెంజ్ విసిరారు.
ఇందులో భాగంగా... ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాట్సప్ గవర్నెన్స్ లో పౌరుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని.. అయినప్పటికీ పేటీఎం బ్యాచ్ లు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ సమయంలో... వాట్సప్ గవర్నెన్స్ లో ఎక్కడైనా హ్యాకింగ్ జరిగిందని నిరూపిస్తే రూ.10 కోట్లు ఇస్తామని సవాల్ చేసినట్లు తెలిపారు.
అయితే... తన సవాల్ కు ఎవరూ స్పందించలేదని లోకేష్ వెళ్లడించారు. విద్యార్థులు ఇంటి నుంచే మొబైల్ ద్వారా హాల్ టిక్కెట్లు పోందారని.. రాబోయే 30 రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల సేవలు కూడా దీని ద్వారా అందుబాటులోకి తెస్తామని లోకేష్ తెలిపారు. ఈ సమయంలోనే వైఎస్ జగన్ కు మొబైల్ ఫోన్ కొనివ్వాలని ఆర్థికమంత్రికి సూచించారు.
అవును... వాట్సప్ గవర్నెన్స్ పై పేటీఎం బ్యాచ్ అసత్య ప్రచారం చేస్తుందని మొదలు పెట్టిన మంత్రి నారా లోకేష్... మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోన్ వాడరంటున్నారని.. అందువల్ల ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఒక ఫోన్ కొని, అందులో వాట్సప్ గవర్నెన్స్ లోడ్ చేసి పంపిస్తే.. అప్పుడైనా నేర్చుకుంటారేమో అని ఎద్దేవా చేశారు.